పల్లెపోరుకు నగారా | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరుకు నగారా

Nov 13 2026 12:58 AM | Updated on Nov 13 2026 12:58 AM

సాక్షి, పాడేరు: ఏజెన్సీలో పల్లెపోరుకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల్లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా.. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో మన్యంలో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 244 పంచాయతీలు, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్‌ 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్‌ జరగనుంది.

ఓటర్లే నిర్ణేతలు

మొత్తంగా మూడు విడతల్లో 244 పంచాయతీలకు సర్పంచ్‌లు, 2,446 వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల ఏర్పాటు, రిటర్నింగ్‌ అధికారుల నియామకం వంటి ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మన్యంలో పల్లెపోరు ఆసక్తికరంగా మారనుంది.

తొలి విడత.. 66 పంచాయతీలు

నవంబర్‌ 26న చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మూడు మండలాల్లోని 66 పంచాయతీలకు 686 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌ 13న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి, 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. 26న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు చేపడతారు. అవసరమైతే 27న రీపోలింగ్‌ నిర్వహిస్తారు.

రెండో విడత.. 87 పంచాయతీలు

నవంబర్‌ 29న పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు మండలాల్లో 87 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 16న నోటిఫికేషన్‌, 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. 24న తుది అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తారు. 29న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మూడో విడత.. 91 పంచాయతీలు

డిసెంబర్‌ 2న పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు మండలాల పరిధిలో 91 పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 19న మూడో విడత ఎన్నికల ప్రకటన, 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న ఉపసంహరణ ప్రక్రియ చేపడతారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించి డిసెంబర్‌ 2న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

పోలింగ్‌ తేదీల వివరాలు

మూడు విడతల్లో సమరం

244 పంచాయతీలు.. 2,446 వార్డులు

4.98 లక్షల మంది ఓటర్లు..

నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఎన్నికల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement