● సీఎం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
● ఆదివాసీలపై వ్యాఖ్యలు దురదృష్టకరం
● ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు
● సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస
అరకులోయ టౌన్ (డుంబ్రిగుడ): ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి.. ఓటమికి కారణాలను పక్కదారి పట్టించేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస విమర్శించారు. ఆదివాసీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య విభజన సృష్టించడం తగదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అరకులోయ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.బి.పోతురాజు అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ సమావేశంలో అప్పలనరస మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి బలవంతపు మతమార్పిడులంటూ అసత్య, విభజనకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే కూటమి ఓటమి చెందిందని, దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ఏజెన్సీ ప్రాంతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అరకులోయలో ఆదివాసీలకు స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని మూడేళ్లు గడిచినా అమలు చేయలేదన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాకై ్సట్ మైనింగ్ పేరుతో ఆదివాసీల అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని గిరిజన ప్రజల తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జయ, మండల కార్యదర్శి కె.రామారావు, పి.బాలదేవ్, చిన్నబాబు, సురేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


