ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డ దాటాలంటే గిరిజనులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గెడ్డకు ఇరువైపులా తాడు కట్టి, దాని ఆధారంగా బోటులో ప్రయాణిస్తేనే అవతలి ఒడ్డుకు చేరుకోగలుగుతున్నారు. నిత్యం ఇదే ప్రమాదకర ప్రయాణం చేస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రయాణ సమయంలో పొరపాటున తాడు తెగితే బోటు మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని, ఫైబర్ బోట్లు అందించాలని పలుమార్లు స్థానిక గిరిజనులు ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం గెడ్డలో నీటి నిల్వ అధికంగా ఉండటంతో భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని లేదా ఫైబర్ బోట్లు అందించి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు


