ప్రతి ఇంటా పీడితులు
కొయ్యూరు: మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైన వారిని డోలిమోతతో డౌనూరు ఆస్పత్రికి తరలిస్తుంటారు. అయితే ప్రస్తుతం వారిని మోసుకెళ్లాల్సిన కుటుంబ సభ్యులు సైతం జ్వరాల బారిన పడటంతో బాధితులను గ్రామం దాటి ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. మర్రి వెంకటరావు కుటుంబంలో ఆయన భార్య లక్ష్మి, కుమార్తెలు రాధిక, అక్షయ జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలోని మొత్తం 30 కుటుంబాల్లో అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడినట్లు గ్రామస్తులు తెలిపారు. డౌనూరు ఆస్పత్రికి వెళ్లాలంటే రోలుగుంట, గొలుగొండ మండలాల మీదుగా సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రహదారి మంజూరైనా పనులు పూర్తికాలేదన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, కలెక్టర్ నిశాంతి గ్రామాన్ని సందర్శించి తమ కష్టాలను తెలుసుకోవాలని కోరారు.
నేడు వైద్య శిబిరం
జాజులబందలో గురువారం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డౌనూరు వైద్యుడు వినయ్ తెలిపారు. గత నెలలో రెండుసార్లు, ఈ నెలలో ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. వర్షాలు కురిసి, అనంతరం ఎండలు కాయడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని జ్వరాలు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు.


