● పాడేరు సబ్ కలెక్టర్ కె. చిరంజీవి సాహిత్
సీలేరు: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసిత గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని పాడేరు సబ్ కలెక్టర్ కె. చిరంజీవి సాహిత్ కోరారు. మంగళవారం నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాండ్ కోరి, పార్వతీనగర్ గ్రామాల నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.9.5 లక్షలు అందించేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. గుర్తించిన 104 మందికి ప్రాజెక్టులో తాత్కాలిక ఉద్యోగాలు కల్పించి, నిర్మాణం పూర్తయ్యాక ఏపీ జెన్‌కోలో ఒప్పంద కార్మికులుగా తీసుకుంటామని వెల్లడించారు. ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి విద్యుత్ పరంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరించి పనులకు ఆటంకం కలిగించవద్దని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు, తహసీల్దార్ అన్నాజీరావు, ప్రాజెక్ట్ ఎస్‌ఈ, ఈఈ పాల్గొన్నారు.


