సాక్షి,పాడేరు: అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మన్యం కాఫీకి దళారీల ధరే దిక్కవుతోంది. ఏటా కష్టపడి కాఫీ పంట సాగుచేసి, పండ్లు సేకరించి, గింజలుగా మార్చి విక్రయించే గిరిజన రైతులకు ఈ ఏడాది కూడా గిట్టుబాటు ధర కరువైంది. కాఫీ పంట సేకరణ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం కొనుగోలు ధరలను ప్రకటించలేదు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సైతం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో గిరిజన రైతులు చేసేదిలేక సంతల్లో దళారీ వ్యాపారులు నిర్ణయించిన ధరకే పాచ్‌మెంట్ కాఫీ గింజలను విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మన్యం కాఫీకి గుర్తింపు ఉన్నా.. పండించిన రైతుకు మాత్రం కనీస ధర దక్కని దుస్థితి నెలకొంది.
లక్షల ఎకరాల్లో సాగు.. వేల టన్నుల దిగుబడి
ఏజెన్సీలో సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాఫీ సీజన్‌కు ముందే జీసీసీ అఫెక్స్ కమిటీ సమావేశం నిర్వహించి పాచ్‌మెంట్, చెర్రీ రకం కాఫీ గింజలకు కొనుగోలు ధరలు ప్రకటించాల్సి ఉంది. కానీ నవంబర్ నెల ప్రారంభమైనా ధరలపై నిర్ణయం తీసుకోకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జీసీసీ కొనుగోళ్లు చేపడుతుందా? లేదా? అన్న సందేహాలు కూడా వారిని వెంటాడుతున్నాయి.
కాఫీ రైతుల శ్రమకు గిట్టుబాటు ఏదీ?
ఏజెన్సీలో ప్రస్తుతం కాఫీ పండ్ల సేకరణ, పల్పింగ్, పాచ్‌మెంట్ గింజల తయారీ, ఎండబెట్టే పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం, జీసీసీ, పాడేరు ఐటీడీఏ కొనుగోలు ధరలను ప్రకటించి రైతులకు భరోసా కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో దళారీ వ్యాపారులదే పైచేయిగా మారింది. ప్రస్తుతం ఏజెన్సీలో పాచ్‌మెంట్ కాఫీ కిలోకు రూ.250 నుంచి రూ.270కే కొనుగోలు చేస్తున్నారు. అదే బెంగళూరు మార్కెట్‌లో కిలోకు రూ.420 నుంచి రూ.450 వరకు ధర పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్ ధరకు, స్థానికంగా రైతులకు లభిస్తున్న ధరకు భారీ వ్యత్యాసం ఉండటంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది కిలో రూ.450 వరకు ధర లభించిందని, ఈ ఏడాది మాత్రం కనీస మద్దతు ధర లేకపోవడంతో దళారులు చెప్పిందే ధరగా మారిందని వాపోతున్నారు.
దళారీల చేతిలో ధరల పగ్గాలు


