చింతపల్లి: అడవుల సంరక్షణలో అమరులైన అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాత్ర చిరస్మరణీయమని డీఎఫ్‌వో వైవీ నరసింహరావు అన్నారు. మంగళవారం రాష్ట్ర అటవీ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో అడవులను కాపాడే విధుల్లో భాగంగా ఎంతో మంది అటవీశాఖ అధికారులు, సిబ్బంది అమరులయ్యారన్నారు. ప్రాణాలు తెగించి విధులు నిర్వహించడం వల్లే నేడు అడవులు పచ్చదనంతో పాటు పర్యావరణ ప్రాంతంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంంలో చింతపల్లి, లోతుగెడ్డ రేంజ్ అధికారులు అప్పారావు,రాజేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
ఫారెస్టు అమరవీరులకు ఘన నివాళి
జి.మాడుగుల: పాడేరు ఫారెస్టు డివిజన్ పరిధిలోని జి.మాడుగుల మండల కేంద్రంలో ఉన్న ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్టు అమరవీరుల చిత్రపటాలకు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో కే. దేవిరాజేశ్వరి, ఎఫ్‌ఎస్‌వో వి.వి.నాయుడు, ఫారెస్టు సిబ్బంది కె.విజయనిర్మల, ఎఫ్‌పీవో కె.సంధ్యారాణి, జె.మాధవి, కె.సత్తిబాబు, బాలన్న, ప్లాంటేషన్ మేసీ్త్రలు పాల్గొన్నారు.
అడవుల రక్షణ అందరి బాధ్యత
ముంచంగిపుట్టు: అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అటవీశాఖ రేంజర్ ఐ.రాము కోరారు. మంగళవారం కించాయిపుట్టు పంచాయతీ కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టడం వల్ల వనరులు, వన్యప్రాణులు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అడవుల సంరక్షణలో ప్రజలు అటవీశాఖకు సహకరించాలని కోరారు. అనంతరం అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌వో స్వర్ణలత, ఎఫ్‌ఎస్‌వోలు నారాయణపడాల్, కార్తీక్, ఎఫ్‌బీవో వెంకటరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు రూరల్: ఘనంగా అటవీ శాఖ అమరవీరుల దినోత్సవ వేడుకలను పాడేరు డీఎఫ్‌వో కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు, అటవీ శాఖలో విధి నిర్వహణలో ఉండి అమరవీరులైన వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏవో కృష్ణమూర్తి మాట్లాడుతూ విధినిర్వహణలో మరణించిన వారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వోలు దేవిరాజేశ్వరి, భాస్కర్‌రావు పాల్గొన్నారు.


