కొయ్యూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ సమరానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని పంచాయతీల ఓటరు జాబితాలు, పోలింగ్ అధికారులకు అందజేయాల్సిన ఎన్నికల సామగ్రిని తీసుకున్నారు. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, తొలి విడతలో భాగంగా 26న కొయ్యూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
క్లస్టర్ల పునర్విభజన
సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మండలంలో తొమ్మిది క్లస్టర్లు ఉండగా, ఈసారి వాటి సంఖ్యను 13కు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. గతంలో యూ.చీడిపాలెం, ఎం.భీమవరం పంచాయతీలకు కలిపి ఒకే క్లస్టర్ ఉండేది. ఈసారి వాటిని విడివిడిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బూదరాళ్ల, మర్రివాడ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నారు. గతంలో కొయ్యూరు, రాజేంద్రపాలెం, మర్రివాడ, బూదరాళ్ల పంచాయతీలకు కలిపి ఒకే క్లస్టర్ ఉండేది. అదేవిధంగా ఆడాకుల, ఆర్.కొత్తూరు పంచాయతీలకు కలిపి మరో క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. బాలారం, కంఠారం, బకులూరు పంచాయతీలకు సంబంధించిన క్లస్టర్‌ను కంఠారంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మిగిలిన ప్రాంతాల్లో ఎంపీటీసీ సెగ్మెంట్ కేంద్రాల వద్ద క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో రెండు నుంచి మూడు పంచాయతీలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించనున్నారు.
9 నుంచి 13కు పెంచుతూకలెక్టర్‌కు ప్రతిపాదనలు
16న నోటిఫికేషన్..26న తొలి విడత ఎన్నికలు


