పాడేరు రూరల్: స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికల విధుల నిర్వహణ నుంచి దివ్యాంగులు, గర్భిణులు, 60 ఏళ్లు నిండిన ఉద్యోగులు, స్టడీ లీవ్‌పై ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయుల టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) భానుమూర్తిరాజును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధుల కేటాయింపులో ఉద్యోగుల వ్యక్తిగత, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దివ్యాంగులు, గర్భిణులు విధులు నిర్వహించడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి మినహాయింపు కల్పించాలని కోరారు. అలాగే 60 ఏళ్లు నిండిన ఉద్యోగులు, స్టడీ లీవ్‌పై ఉన్న ఉపాధ్యాయులను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై డీఈవో భానుమూర్తిరాజు సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రస్తావించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, ఉద్యోగ సంఘాల నేతలు భీమరాజు, సోంబాబు, రామమూర్తి పాల్గొన్నారు.
టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రతినిధుల విజ్ఞప్తి


