అర్నబ్‌ తెచ్చిన కష్టం..! | - | Sakshi
Sakshi News home page

అర్నబ్‌ తెచ్చిన కష్టం..!

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

● జిల్లాలో రూ.50.46 కోట్ల నష్టం అంచనా

● దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు.. ధ్వంసమైన కల్వర్టులు

● 587 హెక్టార్లలో ఖరీఫ్‌, ఉద్యాన పంటలకు నష్టం

సాక్షి, పాడేరు: అర్నబ్‌ తుపాను గిరిజన ప్రాంతాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, వరదలతో రహదారులు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతినగా.. వందలాది హెక్టార్లలో పంటలు నీటిపాలయ్యాయి. సుమారు వంద ఇళ్లు నేలకూలాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కలెక్టర్‌ టి.నిశాంతి ద్వారా అందించిన ఈ నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం రూ.50.46 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.

రోడ్లు, మౌలిక సదుపాయాలకు దెబ్బ

తుపాను ప్రభావంతో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో భారీ నష్టం సంభవించింది. భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో రహదారులు కోతకు గురయ్యాయి. కల్వర్టులు దెబ్బతినడంతో పాటు కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోనూ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. రహదారుల పునరుద్ధరణకు అధికారులు తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల అంచనాలు రూపొందించారు. పలు ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దెబ్బతిన్న పంటలు

తుపాను ప్రభావంతో ఖరీఫ్‌ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 280 హెక్టార్లలో వరి, ఇతర చిరుధాన్యాల పంటలు, 307 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, రాగులు, సామలు, మినుములు, రాజ్‌మా పంటలతో పాటు అరటి, టమాటా, అల్లం, పసుపు, మిరియాలు, బంతి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు సుమారు వంద గృహాలు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో అధికారులు వెంటనే కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement