సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకుడు కూర్మనాథ్, జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రచారాలు చేయరాదని, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై నిరాధార ఆరోపణలు చేయకూడదని స్పష్టం చేశారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదన్నారు. లౌడ్‌స్పీకర్ల వినియోగం, ఎన్నికల సభలు, ర్యాలీల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బహుమతులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పంపిణీ చేయడం నిషేధమన్నారు. ఓటర్లను భయపెట్టడం, బలవంతంగా ఓట్లు వేయించడం, దొంగ ఓట్లకు పాల్పడటం వంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం పాటించాలని, ఆ సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మద్యం విక్రయాలు, పంపిణీపై విధించిన నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని 44 సమస్యాత్మక, మారుమూల పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్ నాగ వెంకట సాహిత్, ఏఎస్పీ శృతి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రచారంలో హద్దులు దాటొద్దు
ఎన్నికల నియమావళిని
కచ్చితంగా పాటించాలి
రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు కలెక్టర్ నిశాంతి ఆదేశం


