చోడవరం బాలాజీనగర్‌లో నీట మునిగిన ఇళ్లు
పూర్ణా థియేటర్ వద్ద చోడవరం–చీడికాడ రోడ్డుపై పారుతున్న వరదనీరు
వరద ముంపులో చాకిపల్లి పరిసర గ్రామాల్లో పాకలు, వరి పొలాలు
భారీ వర్షంతో నీటి మునిగిన కాలనీలు
శారదా, పెద్దేరు, బొడ్డేరు నదుల్లో పెరిగిన నీటి ఉధృతి
ముంపులో వేలాది ఎకరాల్లో వరి, చెరకు పంటలు
చోడవరం: జలదిగ్బంధంలో చోడవరం చిక్కుకుంది. శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. నాలుగు రోజుల పాటు కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు చోడవరం పట్టణంలో లోతట్టు కాలనీలన్నీ నీటమునిగాయి. పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో నీటి ముంపునకు గురయ్యాయి. పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాల నుంచి వేలాది క్యూసెక్యుల నీరు నదుల్లోకి రావడంతో దిగువన ఉన్న చోడవరం, వడ్డాది ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న ఈ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహకంలో పలు చోట్ల గట్లు కోతకు గురయ్యాయి. గోవాడ వంతెన ఇప్పటికే బలహీనంగా ఉండటం వల్ల వంతెన ప్రదేశంలో నది పరవళ్లు తొక్కడంతో వాహనచోదకులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో వరి, చెరకు పంటలు నీట మునిగాయి. చోడవరం మండలం పీఎస్‌పేట, బెన్నవోలు, రామజోగిపాలెం, కన్నంపాలెం, చాకిపల్లి, గౌరీపట్నం, శ్రీరాంపట్నం, మైచర్లపాలెం, భోగాపురం, ముద్దుర్తి, ఖండిపల్లి, దామునాపల్లి, లక్ష్మీపురం, నర్సయ్యపేట, చోడవరం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల్లో వరి, చెరకు పంట నీటి ముంపులోనే ఉంది. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాలకు చోడవరం పట్టణంలో బాలాజీనగర్, పూర్ణా థియేటర్, రెల్లివీధి, బానీకోనేరు, న్యూశాంతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. చెరువులను తలపించే విధంగా ఇళ్లలోకి నీరు చేరింది. అధికారులు ముంపు ప్రాంతాల్లో నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.
రోలుగుంట: మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షపు నీటితో బీఎన్ రోడ్డులో ద్విచక్రవాహనాలు అదుపు తప్పి పలువురు బోల్తా పడ్డారు. కొవ్వూరు మార్గంలోని మరిడమ్మ గుడి సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తమై వాటిని సరిచేసి ఎవరికీ ప్రమాదం లేకుండా చేశారు. ఈదురు గాలులకు పెదగరువు, లోసింగి, అడ్డసరం తదితర గ్రామాల్లో జీడితోటలు, పెదపేట, సింగరాజుపేట తదితర గ్రామాల్లో అరటితోటలు విరిగిపొయాయి. పదెకరాల పంట నష్టం జరిగింది. దీనికి తోడు వచ్చే నెల ఒకటో తేదీన మరో తుపాను రానుందన్న సమాచారంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
వీడని వరద నీరు
రాంబిల్లి: అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంతో శారదా నది, నదీ పరివాహక ప్రాంతాలను వరద నీరు ఇంకా వీడలేదు. రాంబిల్లి మండలం మూలజంప సమీపంలో శుక్రవారం వరద నీరు పెద్ద ఎత్తున కనిపించింది.


