తప్పిపోలేదు.. హతమార్చారు! | - | Sakshi
Sakshi News home page

తప్పిపోలేదు.. హతమార్చారు!

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

కోటవురట్ల: కనిపించకుండా పోయిన ఆటోడ్రైవర్‌ హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం మద్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించి, కర్రతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ఏలేరు కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. చినబొడ్డేపల్లి శివారు ఆర్‌.కొత్తూరుకు చెందిన ఆటోడ్రైవర్‌ ఒబ్బలరెడ్డి రమేష్‌ (24) ఈ నెల 15 నుంచి కనిపించడం లేదు. దీంతో అతని తల్లి ఒబ్బలరెడ్డి మంగ ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అదే గ్రామానికి చెందిన రెడ్డి సత్తిబాబు 2021లో కోటనందూరు మండలం జగన్నాథపురానికి చెందిన రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో రమేష్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసి సత్తిబాబుతో పాటు గ్రామ పెద్దలు పలుమార్లు హెచ్చరించినా రమేష్‌ వైఖరిలో మార్పు రాలేదన్నారు.

పథకం ప్రకారం హత్య : ఈ నేపథ్యంలో ఈ నెల 9న సత్తిబాబు, రాజేశ్వరి మధ్య గొడవ జరగడంతో ఆమె జగన్నాథపురంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను అనుసరించి అక్కడకు వెళ్లిన సత్తిబాబు.. రమేష్‌ ఆమెను కలవడాన్ని గమనించి అతనిపై దాడి చేశాడు. అక్కడి నుంచి రమేష్‌ తప్పించుకోవడంతో అతనిపై పగ పెంచుకున్న సత్తిబాబు హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం రమేష్‌ స్నేహితుడు జి.లోవరాజు సహకారం తీసుకున్నాడు. ఈ నెల 15న లోవరాజు మద్యంలో నిద్రమాత్రలు కలిపి రమేష్‌తో తాగించి జగన్నాథపురానికి తీసుకెళ్లి సత్తిబాబుకు అప్పగించాడు. మద్యం, నిద్రమాత్రల మత్తులో ఉన్న రమేష్‌ను సత్తిబాబు కర్రతో కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వివరించారు. హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు సత్తిబాబు తన అన్న, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నాగేశ్వరరావు సహాయం కోరాడు. అప్పటికే ఆర్‌.కొత్తూరుకు వచ్చిన నాగేశ్వరరావు తమ్ముడి ఫోన్‌తో జగన్నాథపురానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి రమేష్‌ మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ద్విచక్ర వాహనంపై నర్సీపట్నం మండలం వేములపూడికి తరలించారు. అక్కడ ఏలేరు కాలువలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

మృతదేహం కోసం గాలింపు : నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎస్పీ ఆదేశాలతో నక్కపల్లి సీఐ రామకృష్ణ పర్యవేక్షణలో ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఏలేరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు మృతదేహం లభించలేదు. కాలువ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల సిబ్బందితోనూ గాలింపు చేపట్టాలని ఎస్పీ ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో సత్తిబాబు, నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నామని, హత్యకు సహకరించిన జి.లోవరాజును ఏ–3గా చేర్చి కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఘటన కోటనందూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరగడంతో కేసు ఫైల్‌ను అక్కడకు బదిలీ చేయనున్నట్లు తెలిపారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

మద్యంలో నిద్రమాత్రలు కలిపి.. కర్రతో కొట్టి హతం

మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ఏలేరు కాలువలో పడేసిన నిందితులు

అదుపులో ఇద్దరు నిందితులు.. మరొకరిపై కేసు

హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement