నర్సీపట్నం: పట్టణ ప్రజలు తనకు విజయాన్ని అందించి చైర్‌పర్సన్ స్థానంలో కూర్చోబెడతారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కోట్లాది రూపాయలతో సీసీరోడ్లు వేశారని తెలిపారు. ప్రస్తుతం నిర్మితమవుతున్న భారీ తాగునీటి ప్రాజెక్టు గత ప్రభుత్వంలోనే మంజూరైందన్నారు. చైర్‌పర్సన్ అవగానే పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. సరైన డ్రెయిన్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చాలా వీధుల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అభివృద్ధి శూన్యమన్నారు. తాను చైర్‌పర్సన్‌గా పని చేసిన అనుభవంతో ప్రణాళిక బద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను, కూటమి ప్రభుత్వం మరో రెండున్నరేళ్లలో కూలిపోయి, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మున్సిపల్ పీఠంపై వైఎస్సార్‌సీపీ ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రజల ఈ విషయాన్ని గ్రహించి వైఎస్సార్‌సీపీ చైర్మన్‌గా తనకు, కౌన్సిలర్ల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపరుస్తా
నర్సీపట్నం: మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి పేర్కొన్నారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే సంకల్పంతో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూ.267 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించారు. రోడ్డు విస్తరణ విషయం కూడా స్పీకర్ దృష్టిలో ఉందని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాను. తనను చైర్‌పర్సన్‌గా ప్రజలు ఆశీర్వదిస్తే డ్రైనేజీ సిస్టమ్‌ను మెరుగుకు చర్యలు తీసుకుంటాను.
మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి అనిత


