సాక్షి, పాడేరు: అర్నబ్ తుపాన్ జిల్లా ప్రజలను వణికించింది. ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలతో జిల్లాలో అనేక చోట్ల అపార నష్టం సంభవించింది. మూడు రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు గెడ్డలు, కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వందలాది గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో మారుమూల గ్రామాల గిరిజనులు మూడు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు.
నిలిచిన బస్సు సర్వీసులు
అరకు ఘాట్‌రోడ్డులో వర్షాల బీభత్సంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో గత మూడు రోజులుగా అరకు–విశాఖపట్నం మధ్య వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పాడేరు నుంచి విశాఖపట్నం, నర్సీపట్నం మార్గాల్లోనూ ఆర్టీసీ బస్సులను నడపడం లేదు. మైదాన ప్రాంతాల్లోని విజయరామరాజుపేట, వడ్డాది వద్ద కాజ్‌వేలపై వరద ఉద్ధృతి పెరగడంతో బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ జీపులను ఆశ్రయిస్తున్నారు.
రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో..
కేకే లైన్‌లో బొర్రాగుహల సమీపంలో రైల్వే ట్రాక్ మరింతగా కొట్టుకుపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో రైల్వే అధికారులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. మారుమూల గ్రామాలకు వెళ్లే రహదారులు సైతం పలుచోట్ల కోతకు గురయ్యాయి. భారీ వర్షాలకు వంజంగి హిల్స్ రహదారి దెబ్బతింది. వంజంగి ప్రాంతంలోని టెంట్లు, రిసార్టుల రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో నిర్వాహకులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పంటలకు తీవ్ర నష్టం
లోతట్టు భూముల్లోని ఖరీఫ్ వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. పాడేరు, అరకులోయ, హుకుంపేట, అనంతగిరి, డుంబ్రిగూడ మండలాల్లో పంట నష్టం తీవ్రంగా ఉండటంతో వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. వంజంగి పంచాయతీ పరిధిలోని కొత్తవలస గ్రామంలో కొండవాగు ఉద్ధృతికి కోత దశకు చేరుకున్న వరి పంట కొట్టుకుపోయింది. పంట పొలాల్లో మట్టి మేటలు వేసింది. జి.మాడుగుల మండలం సొలబం పంచాయతీలో ఈదురుగాలుల బీభత్సానికి కాఫీ తోటలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో మట్టిగోడల ఇళ్లు కూలిపోయాయి.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
పాడేరు పట్టణంలోని మెయిన్‌రోడ్డు, కలెక్టర్ బంగ్లా రోడ్డులో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో గురువారం రాత్రికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ఐరన్ వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవాహం
ముంచంగిపుట్టు: జోలాపుట్టు జలాశయం నుంచి భారీగా వరదనీటిని విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని ఐరన్ వంతెనపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గురువారం ఉదయం నుంచి వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు వంతెనకు అటువైపు, ఇటువైపు చిక్కుకుపోయారు. జోలాపుట్టు జలాశయం నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు నిత్యం కాలినడకన రాకపోకలు సాగించే ఐరన్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోతుందేమోనని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.2024 తర్వాత ఈ స్థాయిలో వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.9 కోట్లతో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జోలాపుట్టు ఆర్‌ఎఫ్, ఎల్‌ఎఫ్ గ్రామాల ప్రజలు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే సరిహద్దు ప్రాంత ప్రజల రాకపోకల కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యగెడ్డకు భారీగా వరదనీరు
ముంచంగిపుట్టు: మండలంలోని పలు పంచాయతీల గుండా ప్రవహించే మత్స్యగెడ్డలో భారీగా వరదనీరు చేరుతోంది. ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద ఉధృతిని చూస్తున్నామని పరిసర గ్రామాల గిరిజనులు చెబుతున్నారు. గురువారం ఉదయం సుజనకోట పంచాయతీ కేంద్రంలో మత్స్యగెడ్డ నీటి ప్రవాహం ఇళ్ల సమీపానికి చేరుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సుజనకోట, పెదగూడ, దారెల పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల వద్ద మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు భారీగా చేరడంతో గిరిజనులు చేపల వేటను సైతం నిలిపివేశారు. పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక ఎస్‌ఐ నాని, తహసీల్దార్ త్రినాథనాయుడు ఆయా గ్రామాల గిరిజనులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు నాటు పడవలపై ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైతే తప్ప గ్రామాల నుంచి బయటకు వెళ్లవద్దని కోరారు. వరద పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
స్తంభించిన రాకపోకలు
పెదబయలు: తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరదానిపుట్టు గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డ కాజ్‌వేపై రెండు రోజులుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో పెదకోడాపల్లి, కుంతుర్ల, కిముడుపల్లి, పాడేరు మండలం కించూరు పంచాయతీలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం ఉదయం వర్షం తగ్గినప్పటికీ కాజ్‌వేపై వరద ఉద్ధృతి కొనసాగడంతో రాకపోకలు పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది. పెదబయలు, పాడేరు మండలాలకు చెందిన వందలాది గ్రామాల ప్రజలు ఈ మార్గం మీదుగానే జిల్లా కేంద్రం పాడేరుకు రాకపోకలు సాగిస్తుంటారు. వరద తగ్గకపోవడంతో మూడు పంచాయతీల ప్రజలు లక్ష్మీపేట మీదుగా పెదబయలు చేరుకుని అక్కడి నుంచి పాడేరు వెళ్లాల్సి వస్తోంది. వరద ఉద్ధృతి అధికంగా ఉన్నప్పటికీ రెవెన్యూ, పోలీసు అధికారులు గెడ్డకు ఇరువైపులా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరదానిపుట్టు కాజ్‌వే ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షాలు కురిసిన ప్రతిసారీ వరద నీరు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కాజ్‌వేల స్థానంలో వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి పరదానిపుట్టు మత్స్యగెడ్డపై వంతెన నిర్మించి తమ ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. పెదకోడాపల్లి, కిముడుపల్లి, కుంతుర్ల, పాడేరు మండలం పెదకించూరు పంచాయతీల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు గుత్తులపుట్టు వారపు సంతకు వెళ్తుంటారు. అయితే మత్స్యగెడ్డ కాజ్‌వేపై వరద ఉద్ధృతి కారణంగా సంతకు వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలకు సైతం అంతరాయం ఏర్పడుతోందని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అర్నబ్ తుపానుకు అపార నష్టం
జిల్లాను వణికించిన భారీ వర్షాలు
ఈదురుగాలులలో ప్రజలు ఆందోళన
మూడు రోజులుగా అరకు ఘాట్‌లో
నిలిచిన రవాణా
పాడేరు–విశాఖ మధ్య ఆర్టీీసీ బస్సుల బంద్


