● అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి
● వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫునవిస్తృత ప్రచారం
సాక్షి, పాడేరు: జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పిలుపునిచ్చారు. గురువారం హుకుంపేట జడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంక, తడిగిరి, తీగలవలస ఎంపీటీసీ అభ్యర్థులు కనకమహాలక్ష్మి, పాంగి తులసమ్మ విజయాన్ని కోరుతూ ఆయా పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ పాలనలో గిరిజనుల అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వ హయాంలో వారికి అన్యాయం జరుగుతోందని ఎంపీ విమర్శించారు.
జయవర్ధిని విస్తృత ప్రచారం
అనంతగిరి: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దూరు జయవర్ధిని గురువారం మారుమూల వాలసీ, కుంబుర్తి, పట్టి, గుమ్మ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి రేగబోయిన స్వామితో కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దూరు గంగన్నదొర, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మేలు చేసే వారికే ఓటు వెయ్యండి :మాధవి
కొయ్యూరు: ఓటు విలువను తెలుసుకుని, ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జెడ్పీటీసీ అభ్యర్థి గొడ్డేడి మాధవి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ఓటర్లను కోరారు. హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చని నాయకులు కావాలో, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నాయకులు కావాలో ఓటర్లు ఆలోచించాలని అన్నారు.
గురువారం మండలంలోని బాలారం, కొమ్మిక, ఆడాకుల సెగ్మెంట్లలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల్లో వందలాది మంది రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు అందించినట్లు పేర్కొన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మూడు సెగ్మెంట్ల పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొడ్డేడి మాధవితో పాటు 14 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచారంలో పార్టీ మాజీ అధ్యక్షుడు జల్లి బాబులు, జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ, నాయకులు సుధాకర్, బాబాజీ, బుజ్జి పాల్గొన్నారు.


