చింతపల్లి: తుపాను వర్షాలకు దెబ్బతిన్న వరి, రాగి, మొక్కజొన్న పంటలను చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. ఏడీఆర్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో గూడెం, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో పర్యటించి రైతులకు సూచనలు చేశారు. వరి పొలాల్లో నిల్వ నీటిని బయటకు పంపాలని, ఒరిగిన మొక్కలను కాండం విరగకుండా చిన్నచిన్న కుప్పలుగా కట్టాలని సూచించారు. రాగి, మొక్కజొన్న పంటల్లో ఎరువులు, పురుగుమందుల వినియోగంపై అవగాహన కల్పించారు.
దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించొద్దు
ప్రత్యామ్నాయ మార్గం వినియోగించాలి
ఎస్పీ అమిత్‌బర్దర్
జి.మాడుగుల: అర్నాబ్ తుపాను ప్రభావంతో సంతబయలు గ్రామ సమీపంలో రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రహదారి దెబ్బతిందని, పాడేరు–జి.మాడుగుల మధ్య ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఒక ప్రకటనలో సూచించారు. సంతబయలు సమీపంలోని దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించడం ప్రమాదకరమని, వాహనదారులు ఆ మార్గాన్ని వినియోగించకుండా ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించాలని తెలిపారు. ఈదులబయలు జంక్షన్–క్వారీ–సింగర్భ–తహసీల్దార్ కార్యాలయం జంక్షన్, జి.మాడుగుల మీదుగా రాకపోకలు సాగించాలని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, వాహనాలను నెమ్మదిగా నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. దెబ్బతిన్న రహదారి ప్రాంతంలోకి వెళ్లకుండా, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. రహదారి పునరుద్ధరణ పూర్తయ్యే వరకు ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించుకోవాలని, పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


