జలాశయాలకు వరద ఉధృతి | - | Sakshi
Sakshi News home page

జలాశయాలకు వరద ఉధృతి

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

● జోలాపుట్టు, డుడమకు భారీగా ఇన్‌ఫ్లో

● 25 వేల క్యూసెక్కులు విడుదల

ముంచంగిపుట్టు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డుడుమ, జోలాపుట్టు జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో జలాశయాల నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే ఈ జలాశయాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో నిరంతరం నీటిమట్టాలను పర్యవేక్షిస్తున్నారు.

నిండుగా డుడుమ..

డుడుమ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా, గురువారం నాటికి 2,588 అడుగులకు చేరింది. దీంతో 3, 5 నంబరు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు.

ప్రమాదస్థాయికి జోలాపుట్టు..

ఇక డుడుమ జలాశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయం నీటిమట్టం కూడా ప్రమాద స్థాయికి చేరువైంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, గురువారం ఉదయం నాటికి 2,748 అడుగులకు చేరింది. దీంతో ఒడిశా స్పిల్‌వే నుంచి నాలుగు గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన జలాశయం నుంచి మరో నాలుగు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

రెండేళ్ల తరువాత..

వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటగంటకు నీటిమట్టాలను పరిశీలిస్తూ, వరద ఉధృతికి అనుగుణంగా నీటి విడుదలను పెంచుతున్నారు. ఈ రెండు జలాశయాల చరిత్రలో 2024 సెప్టెంబరులో ఇదే స్థాయిలో వరదనీరు చేరిందని, రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రస్తుతం భారీగా నీటిని విడుదల చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement