స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం
సరిహద్దు గ్రామాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాల మోహరింపు
మండల కేంద్రాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు
ముంచంగిపుట్టు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) అటవీ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత వారం రోజులుగా భారీగా బలగాలను మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని ఒడిశా సరిహద్దు గ్రామాల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగబయలు, బుంగాపుట్టు, కుమడ, భూసిపుట్టు, జామిగూడ, ఇంజిరి పంచాయతీల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. మరోవైపు ముంచంగిపుట్టు మండల కేంద్రంలోనూ వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రయాణికుల లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానితుల వివరాలను సేకరించిన అనంతరం పంపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి వేళల్లోనూ మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఏవోబీలో కూంబింగ్ నిర్వహించని పోలీసులు.. వారం రోజులుగా భారీగా బలగాలను రంగంలోకి దించడంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై చర్చ జరుగుతోంది. దీనికితోడు మారుమూల పంచాయతీల్లోని ఎంపీటీసీ అభ్యర్థులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రజాప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


