ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. తుపాను కారణంగా గత రెండు రోజులుగా సరిహుద్దులో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భారీగా వరదనీరు చేరుతోంది. జోలాపుట్టు జలాశయ నీటి మట్టం 2,750 అడుగులు కాగా బుధవారం నాటికి 2,748 అడుగులుగా నమోదయింది. జోలాపుట్టు జలాశయ నీటి మట్టం క్రమేపి పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది జలాశయం నుంచి 1,2,3, నంబర్ల గేట్లు రెండు అడుగులు పైకెత్తి 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 4వ నంబరు గేటును ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని డుడుమ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు,డుడుమ జలాశయాల నీటి మట్టాలను ప్రాజెక్టు అధికారులు, జలాశయ సిబ్బంది నిరంతరం అంచనా వేస్తూ ప్రమాద స్దాయి నుండి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
● జోలాపుట్టు జలాశయంలో నీటి నిల్వలపై ఎంపీడీవో ధర్మారావు, తహసీల్దార్ త్రినాథ్‌నాయుడు బుధవారం జోలాపుట్టు జలాశయం అధికారులతో మాట్లాడారు. నీటి విడుదల సమయంలో ముందస్తు సమాచారం అందించాలని జలాశయ అధికారులకు సూచించారు. సరిహద్దులో ఉన్న వనుగుమ్మ, రంగబయలు, మాకవరం, దొడిపుట్టు పంచాయతీల్లోని గిరిజన గ్రామాల ప్రజలు వాగులు,గెడ్డలు దాటవద్దని ఆదిశగా పంచాయతీ అధికారులు, సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చేపల వేట, నాటు పడవలపై వాగులు దాటవద్దని ఎంపీడీవో ధర్మారావు,తహసీల్దార్ త్రినాథ్‌నాయుడు మత్స్యగెడ్డ పరివాహిక గ్రామాల గిరిజనులకు వారు సూచించారు.
సీలేరు: ఆర్నాబ్ తుపాను ప్రభావంతో ఏజెన్సీ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని జలాశయాలకు వరదనీరు పోటెత్తుతోంది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో నీటిమట్టాలు పెరగ్గా.. తాజా వర్షాలతో మరింత నీరు చేరుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నామని ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు బుధవారం తెలిపారు. జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే ప్రధాన బలిమెల జలాశయంలో బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 1,505 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు. ప్రస్తుతం 7,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, జలాశయంలో 73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే గుంటవాడ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,560 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 1,339 అడుగులుగా నమోదైంది. జలాశయంలోకి స్వల్పంగా వరదనీరు చేరుతోంది. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని డొంకరాయి ప్రధాన డ్యాం గేట్లను ఎత్తి దిగువకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, బుధవారం నాటికి 1,030.90 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో పాటు విద్యుదుత్పత్తి అనంతరం విడుదలవుతున్న నీరు డొంకరాయికి చేరుతోంది. నీటిమట్టాన్ని మరింత తగ్గించే వరకు నీటి విడుదల కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
భారీగా చేరుతున్న వరదనీరు
2,748 అడుగులకు చేరిన నీటిమట్టం
నాలుగు గేట్లు ఎత్తి నీటి విడదల


