సాక్షి, పాడేరు: అర్నబ్ తుపాను ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. మంగళవారం రాత్రంతా ఈదురుగాలులతో కూడిన వర్షం కుండపోతగా కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
● అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో వర్ష బీభత్సానికి బీసుపురం వద్ద రక్షణ గోడ కొట్టుకుపోయి రోడ్డు కోతకు గురైంది. అలాగే ఘాట్‌లోని గాలికొండ వ్యూపాయింట్ ప్రాంతంలో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించడంతో పోలీసులు వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో విశాఖ నుంచి అరకులోయ ప్రాంతానికి రవాణా వ్యవస్థ స్తంభించింది. బొర్రా గుహల రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. బొర్రా గుహల వద్ద రైల్వే ట్రాక్ మట్టికోతకు గురైంది. ఈ మార్గంలో గూడ్స్‌తో పాటు ప్యాసింజర్ రైళ్లను ముందస్తుగానే రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.
● జిల్లా వ్యాప్తంగా కొండవాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జి.మాడుగుల, పెదబయలు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాలకు రవాణా స్తంభించింది. మత్స్యగెడ్డ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. హుకుంపేటలోని రాళ్లగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తూ కాజ్‌వేపై నుంచి పొంగిపోతోంది. గడికించుమండ, బారాపల్లి పంచాయతీల్లోని గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఖరీఫ్ వ్యవసాయ భూములు వరద ముంపునకు గురయ్యాయి. పంట నష్టాలను వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గిరిజనుల మట్టిగోడల ఇళ్లు కూలిపోయాయి.
● జిల్లా వ్యాప్తంగా 1,229.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో 75.4, పెదబయలులో 80.6, డుంబ్రిగుడలో 121.4, అరకులోయలో 144.6, అనంతగిరిలో 123.6, హుకుంపేటలో 140.6, పాడేరులో 124, జి.మాడుగులలో 113.2, చింతపల్లిలో 103.2, జి.కే.వీధిలో 95.6, కొయ్యూరులో 107.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు విద్యాసంస్థలకు సెలవు
జిల్లాలోని అన్ని యాజమాన్య, పాఠశాలలు, కళాశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ నిశాంతి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు.
కొయ్యూరు: చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతాన్ని నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అర్నాబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు 516ఈ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులు, తహసీల్దార్‌తో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న రహదారులపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో దృష్టి సారించాలని సూచించారు.
డుంబ్రిగుడ: మంగళవారం రాత్రి వర్షానికి పర్యాటక ప్రాంతం చాపరాయిలో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. వరద ఉధృతి పెరగడంతో చాపరాయిని మూసివేశారు. గెడ్డలు పొంగి ప్రవహిస్తుండటంతో పెద్దపాడు, కోసంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కించుమండ, కొర్రా మీదుగా పట్టాం రోడ్డులో వంతెన మునిగిపోగా, అరకు–కొర్రాయి–కొల్లాపుట్టు మీదుగా ఒడిశాకు వెళ్లే మార్గంలోనూ రాకపోకలు బంద్ అయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా చాపరాయి, అరకులోని పైనరీలను అధికారులు మూసివేశారు.
మత్స్యపురం కల్వర్టు తాత్కాలికంగా మూసివేత
జి.మాడుగుల: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మత్స్యపురం వద్ద జాతీయ రహదారి 516ఈ అప్రోచ్ రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రహదారిని తాత్కాలికంగా మూసివేయాలని ఎస్పీ అమిత్ బర్థర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కల్వర్టును పరిశీలించిన ఆయన.. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ, మిగిలిన వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని సూచించారు. సీఐ లక్ష్మణరావు, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎస్‌ఐ సాయిరాం పడాల్ పాల్గొన్నారు.
కూలిన విద్యుత్ స్తంభాలు
జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం రాత్రి పది గంటల సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మొయిన్‌రోడ్డులోని ఆస్పత్రి సెంటర్ నుంచి జీసీసీ డీఎం కార్యాలయం వరకు ఐదు స్తంభాలు పడిపోయాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా లేనందున పెను ప్రమాదం తప్పింది.
చింతాలమ్మ ఘాట్‌లో ప్రమాద ఘంటికలు
విరిగిపడిన కొండచరియలు
జలదిగ్బంధంలో గిరిజన గ్రామాలు
కుండపోతతో స్తంభించిన జనజీనవం
కొండచరియలు జారిపడటంతో రాకపోకలకు బ్రేక్
ఉధృతంగా గెడ్డలు, కొండవాగులు
వరద ముంపులో ఖరీఫ్ పంటలు
నేలకూలిన చెట్లు.. ఇళ్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
కొయ్యూరు: అర్నబ్ తుపాను ప్రభావంతో చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున కొండచరియలు రోడ్డుపై పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని జేసీబీల సాయంతో కొండచరియలను తొలగించారు.ఈ ఘాట్‌రోడ్డులో తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొండపై నుంచి రాళ్లు, మట్టి వాహనాలపై పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నామని వాపోతున్నారు.
నిమ్మలపాలెం రోడ్డులో చెట్ల తొలగింపు
కొయ్యూరు–రేవళ్లు రహదారిలోని నిమ్మలపాలెం సమీపంలో చెట్లు కూలిపడ్డాయి. దీంతో మంప ఎస్‌ఐ శ్రీనివాస్ వాటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షాలతో కాలువల్లో నీటి ఉద్ధృతి పెరిగింది.


