ఐనాడలో టీడీపీకి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఐనాడలో టీడీపీకి షాక్‌

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

● వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిక

● ఆహ్వానించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు

పాడేరు: ఐనాడ పంచాయతీలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీలో ఆ పార్టీకి అండగా ఉన్న చీమలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీలో చేరాయి. పాడేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో ఇటీవల ఐనాడ ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ముర్ల అర్జున్‌రావుతో పాటు 120 మంది టీడీపీ శ్రేణులు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ ఐనాడ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తూపూరు గంగరాజు, పాడేరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సీదరి రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చేతకాక అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, భౌతిక దాడులకు పాల్పడుతూ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి రెండున్నరేళ్ల పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నవంబర్‌ 5న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముర్ల అర్జున్‌రావు మాట్లాడుతూ.. తాను గత ఏడేళ్లుగా టీడీపీ జెండా మోస్తున్నానని తెలిపారు. ఐనాడ ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా తనతో నామినేషన్‌ వేయించారని, అయితే పార్టీ కోసం కష్టపడిన తనకు బీ–ఫారం ఇవ్వకుండా డబ్బులకు, ప్రలోభాలకు లొంగి మరో వ్యక్తికి టికెట్‌ కేటాయించారని ఆరోపించారు. టీడీపీని నమ్ముకున్నందుకు తగిన శాస్తి జరిగిందని, నమ్ముకున్న వారిని వమ్ము చేయడమే ఆ పార్టీ నైజమని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ‘జై జగన్‌.. జైజై జగన్‌’ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, మాజీ సర్పంచ్‌లు ఈశ్వర్‌రావు, సిరగం దశమూర్తి, పార్టీ సీనియర్‌ నాయకులు సారె చినలక్ష్మణ్‌, గెమ్మెలి బాలరాజు, తుంబేల ఆనంద్‌, కర్రిబోయిన దేముడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement