సాక్షి,పాడేరు: నవంబర్ 3న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిశాంతి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 11 జెడ్పీటీసీలు, 172 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 21 నుంచి 23 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లోని ఎంపీడీవోలకు నామినేషన్లు సమర్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జతజేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆమె సూచించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు జారీ చేసే సూచనలు, అధికారిక మార్గదర్శకాలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు.
అధికారులకు ఆదేశాలు
జిల్లాలో 11 జెడ్పీటీసీలు,172 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు గాను 616 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఎన్నికలలకు జిల్లాలో మొత్తం 4,98,467 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి, ఇతర ఏర్పాట్లపై ఎన్నికల యంత్రాంగానికి తగిన ఆదేశాలిచ్చామన్నారు. ఎన్నికల కోడ్‌ను ఖచ్చితంగా అమలుచేయాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు
ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరణ
24న నామినేషన్ల పరిశీలన
25న తిరస్కరించిన నామినేషన్లపై
అప్పీళ్ల దాఖలు
26న అప్పీళ్ల పరిష్కారం
27 మధ్యాహ్నం 3గంటల వరకు
నామినేషన్ల ఉపసంహరణ
27న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన
నవంబర్ 3 ఉదయం 7 నుంచి
సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
నవంబర్ 4 అవసరమైన చోట రీపోలింగ్
నవంబర్ 5 ఉదయం 8 నుంచి
ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల ప్రకటన
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
జిల్లాలో 11 జెడ్పీటీసీలు, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
616 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
కలెక్టర్ నిశాంతి


