నిలకడగా జోలాపుట్టు జలాశయ నీటి మట్టం | - | Sakshi
Sakshi News home page

నిలకడగా జోలాపుట్టు జలాశయ నీటి మట్టం

Oct 20 2026 4:55 AM | Updated on Oct 20 2026 4:55 AM

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు జలాశయ నీటి మట్టం నిలకడగా ఉంది. గత నెల వరకు భారీ వర్షాలతో ప్రమాద స్థాయి కి చేరుకున్న జలాశయ నీటి మట్టాన్ని క్రమేపి అధికారులు తగ్గిస్తూ వచ్చారు. దీంతో నీటి మట్టం స్థాయి సాధారణ స్థాయికి చేరుకుంది. జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా సోమవారం నాటికి 2,546.65 అడుగులుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజుకు 2548.50 అడుగుల నీటి మట్టం ఉండేది. జోలాపుట్టు జలాశయం గేట్లు మూసి, నీటి విడుదల నిలిపివేయడంతో సరిహద్దు గ్రామాల మీదుగా విస్తరించి ఉన్న మత్స్యగెడ్డకు జలకళ నెలకొంది. మత్స్యగెడ్డపై నాటు పడవలపై ప్రయాణించే గిరిజనులు భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు.

ఏజెన్సీలో భారీ వర్షం

కొయ్యూరు/గూడెం కొత్తవీధి: ఏజెన్సీలో పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి గంటకుపైగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. జీకే వీధి జాతీయరహదారిపై వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొద్దిసేపు వాహనాలను నిలిపివేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, మెట్ట పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు.

36 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

ఆరిలోవ: ఎన్నికల శిక్షణకు హాజరుకాని 36 మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విభాగం అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించిన శిక్షణకు వారు గైర్హాజరయ్యారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 19 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 17 మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా ఈ నెల 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్‌ఏడీ ప్రాంతంలోని విమాన నగర్‌ సామాజిక భవనంలో నిర్వహించనున్న రెండో విడత శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement