ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి పరిసరాల్లోని చేరువులవెనం అందాలు ఆకట్టుకుంటున్నా.. అక్కడికి చేరుకోవాలంటే మాత్రం నరకయాతనే. 2 కిలోమీటర్ల ఘాట్‌లో మట్టిరోడ్డుపై ప్రయాణం గిరిజనులు, పర్యాటకులకు నిత్యం సాహస యాత్రే. మంజూరైన పక్కా రోడ్డుకు అటవీ శాఖ అనుమతుల జాప్యం కారణంగా పనులు ముందుకు కదలడం లేదు. సాక్షాత్తూ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రోడ్డు మంజూరు చేస్తే.. ఆ శాఖే కొర్రీలు పెట్టడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పవన్ ఇచ్చిన మాట
సాక్షి, పాడేరు: చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీలోని చేరువులవెనం ఆదివాసీ గ్రామం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. సముద్ర మట్టానికి సుమారు 2,400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గిరిశిఖర ప్రాంతానికి చేరుకోవాలంటే మాత్రం కష్టసాధ్యమైన ప్రయాణం తప్పదు. రాళ్లతో కూడిన మట్టిరోడ్డులో వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. స్థానిక గిరిజనులు సుమారు 2 కిలోమీటర్ల ఘాట్‌ను కాలినడకనే దాటుతూ తమ దైనందిన అవసరాలు తీర్చుకుంటున్నారు. పర్యాటకులు మాత్రం వాహనాలను కొండ దిగువన ఉన్న బీమానపల్లి వద్దే నిలిపివేసి కష్టపడి కొండెక్కుతున్నారు. నడవలేని వారు సర్వీస్ జీపులపై ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనికి అధిక ఖర్చులు కూడా భారం అవుతున్నాయి.
‘అడవిబాట’లో రోడ్డు మంజూరు
చేరువులవెనం ఘాట్‌రోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అడవిబాట పథకం కింద రూ.2.80 కోట్లు మంజూరయ్యాయి. డుంబ్రిగుడ మండలంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేసిన రోడ్లలో ఇదీ ఒకటి. అయితే అటవీశాఖ అనుమతుల జాప్యం కారణంగా టెండర్లు పూర్తయ్యినా పనులు ప్రారంభం కాలేదు. గతేడాది నుంచి పనులు నిలిచిపోవడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం పర్యాటక సీజన్ ప్రారంభమవడంతో సందర్శకుల రద్దీ పెరిగినా రోడ్డు దుస్థితి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాడేరు ఐటీడీఏ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు స్పందించి కనీసం ఘాట్‌లో బండరాళ్ల తొలగింపు, మట్టి చదును పనులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
వర్షం కురిస్తే నడవడానికీఇబ్బందే..
చేరువులవెనం ఘాట్‌రోడ్డు అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అటవీ శాఖ అనుమతులు లేవని గత సంవత్సరం నుంచి రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. వర్షం వస్తే కాలినడకకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పర్యాటకులు కూడా భయపడుతూనే సర్వీసు జీపుల్లో ప్రయాణిస్తున్నారు. ద్విచక్రవాహన చోదకులు తరచూ జారీ పడుతున్నారు. గత కలెక్టర్‌తో పాటు ప్రస్తుత ఐటీడీఏ పీవోకు అనేక సార్లు వినతిపత్రం అందజేసినా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. – పాంగి చంటిబాబు,
చేరువులవెనం, చింతపల్లి మండలం
డీఆర్‌సీ ఆమోదం
చేరువులవెనం రోడ్డు పనులకు ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన డీఆర్‌సీ ఆమోదం తెలిపింది. అటవీ శాఖ నుంచి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. రోడ్డు పనులను ఇంజినీరింగ్ శాఖలు చేపట్టాల్సి ఉంటుంది. – నరసింహారావు,
డీఎఫ్‌వో, చింతపల్లి అటవీ డివిజన్
అందమైన చేరువులవెనం
కొండపైకి మట్టిరోడ్డే దిక్కు
పక్కా రోడ్డుకు ఏడాదిగాఅటవీ శాఖ కొర్రీ
ఆ శాఖ మంత్రి పవన్ కల్యాణ్
ఆదేశాలూ బేఖాతర్
పర్యాటకులు, గిరిజనులకుతప్పని పాట్లు


