అనంతగిరి(సాక్షి, పాడేరు): అనంతగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల–1ను ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, కూరగాయల నిల్వ గదిని పరిశీలించారు. విద్యార్థినుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను క్షుణంగా తనిఖీ చేశారు.
వంట గదిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. విద్యార్థినులకు వండే కూరగాయలు తక్కువగా ఉండడాన్ని గమనించి ప్రశ్నించారు. మెనూ ప్రకారం 57 కిలోల కూరగాయలతో వంటకాలు చేయాల్సి ఉండగా, 15 కిలోలనే వినియోగించడాన్ని గుర్తించి నిలదీశారు. 420 మంది బాలికలకు 15 కిలోల కూరగాయలతో కూరలు వండడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల పౌష్టికాహారం, ఆరోగ్యంతో చెలగాటం ఆడడం సరికాదని పాఠశాల నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం పాఠశాల సమస్యలపై సమీక్షించారు. ప్రహరీ లేకపోవడంతో బాలికలకు భద్రత సమస్య తలెత్తుతోందని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించి ఎమ్మెల్యే ఫోన్‌లో కలెక్టర్‌తో మాట్లాడారు. బాలికల సంక్షేమం, భద్రత చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు.
బాలికల పౌష్టికాహారంపై నిర్లక్ష్యం తగదు
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆగ్రహం
అనంతగిరి బాలికల ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ


