బంధవీధిలో కలెక్టర్‌ నిశాంతి పర్యటన | - | Sakshi
Sakshi News home page

బంధవీధిలో కలెక్టర్‌ నిశాంతి పర్యటన

Sep 20 2026 12:45 AM | Updated on Sep 20 2026 12:45 AM

తాగునీటి సమస్య పరిష్కారానికిరూ.16 లక్షలు

డ్రైనేజీ సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశం

జి.మాడుగుల: మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధి గ్రామంలో కలెక్టర్‌ టి.నిశాంతి శనివారం పర్యటించారు. గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పశువైద్యశాల వద్ద స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. దిగువ బంధవీధిలో ఒక ఇంటి వద్ద గ్రామస్తులతో ఆత్మీయంగా ముచ్చటించిన కలెక్టర్‌, వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు తెలియజేయడంతో, వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి కారణాలు ఆరా తీశారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.16 లక్షలు మంజూరు చేసి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాగభూషణంకు బాధ్యతలు అప్పగించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్‌–516 ఈ పనుల కారణంగా మూడు హ్యాండ్‌పంపులు, ఒక వాటర్‌ట్యాంకు, ఒక బావి తొలగించడంతో సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

డ్రైనేజీ సమస్యపై ఆదేశాలు

గ్రామంలో డ్రైనేజీ సమస్యను గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశుభ్రత, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

శిక్షణతో బోధన నైపుణ్యాల పెంపు

బంధవీధి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. స్కూల్‌ క్లస్టర్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించి, ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల 3, 4వ శనివారాల్లో నిర్వహించే శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ చిన్న వయస్సులో విద్యార్థులకు అందించే విద్య, విలువలు వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని చెప్పారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు తమ గురువులను తప్పకుండా గుర్తు చేసుకుంటారని తెలిపారు.

శత శాతం ఫలితాలకు కృషి

ఉపాధ్యాయులు తమ బోధన పద్ధతులను నిరంతరం సమీక్షించుకోవాలని, ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తున్న వారు మరింత మెరుగైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement