● రైతులకు తక్షణమే పరిహారంప్రకటించాలి
● ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, పంట సాగులో నష్టపోయిన గిరిజన రైతులకు మానవత దృక్పథంతో తగిన పరిహారం అందించి ఆదుకోవాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మండలంలోని డి.గొందూరు గ్రామ పరిసరాల్లో ఎండిపోయిన, బీడువారిన పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో కొందరు రైతులు వరి సహా ఇతర పంటల సాగుకు దూరమయ్యారని, మరికొందరు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి నష్టపోయామని ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రైతులకు కరువు కాటకాలు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, తిండి గింజలు కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. కరువు పరిస్థితుల్లో గిరిజన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టకపోవడం దారుణమన్నారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి గిరిజన రైతులకు తగిన పరిహారం ప్రకటించాలని, పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే రైతుల కష్టాలు తగ్గేవని పేర్కొన్నారు. గిరిజన రైతులను ఆదుకోకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి సురేష్‌కుమార్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ సర్పంచ్‌లు వనుగు బసవన్నదొర, సిరగం దశమూర్తి, నాయకులు ముంచంగి రాజం నాయుడు, రామ్‌గోపాల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


