జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వీధులు, రహదారులు జలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంతబయలు గ్రామంలో నిర్వహించిన వారపు సంత వర్షపు నీటికి తడిసి ముద్దయింది. సంతలోని నిత్యావసర సరుకులు, వస్త్రాల దుకాణాలు నీట మునిగి సామగ్రి తడవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జి.మాడుగుల–వంజరి, లంబసింగి మార్గంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి మట్టి రోడ్డు వర్షానికి బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి.
కొయ్యూరు: మండలంలో గత రెండు రోజులుగా భానుడి ప్రతాపానికి చెక్ పెడుతూ భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం వినాయక చవితి పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలాగే మంగళవారం ఉదయం కూడా బలమైన వర్షం కురిసింది. ఎండ తీవ్రతకు వరి పంటలు ఎండిపోతాయని దిగులు చెందుతున్న రైతులకు ఈ వర్షం కొండంత భరోసానిచ్చింది. ఈ వర్షాలతో వరి 15 రోజుల వరకు నీటి ఇబ్బంది తీరినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వర్షాభావం వల్ల స్థానిక కాలువల్లో నీటి ఉద్ధృతి పెరగకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో కాలువలు పూర్తిస్థాయిలో ప్రవహించకపోతే, పంటల సాగు కోసం మళ్లీ వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.


