పాడేరు మండలం వంటివీధుల ఘాట్‌లో కనువిందు చేస్తున్న సూర్యోదయం
డుంబ్రిగుడలో జాతీయ రహదారిని కమ్మేసిన మంచు తెరలు
పాడేరు మండలం వంజంగి కొండలపై అబ్బుర పరిచిన మేఘ సౌందర్యం
సాక్షి, పాడేరు / డుంబ్రిగుడ: సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో కనిపించే దట్టమైన పొగమంచు.. ఈసారి సెప్టెంబర్‌లోనే మన్యాన్ని పలకరిస్తోంది. ఏజెన్సీ వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఉదయం 8 గంటలైనా మంచు తెరలు వీడక, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మంగళవారం ఉదయం పాడేరు మండలంలోని సుప్రసిద్ధ వంజంగి కొండలు, కించూరు పంచాయతీ పరిధిలోని వంటివీధుల ప్రాంతాల్లో సూర్యోదయ వేళ మేఘాలు, పొగమంచు కలసిపోయిన దృశ్యాలు కనువిందు చేశాయి. అలాగే డుంబ్రిగుడ మండల కేంద్రంతో పాటు అరకు – పాడేరు జాతీయ రహదారిని దట్టమైన మంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో దిగులు చెందుతున్న కూరగాయల రైతులకు ఈ పొగమంచు ఊరటనిస్తోంది. వర్షం లేకపోయినా, ఈ మంచు తేమతోనైనా కూరగాయల పంటల కాపు పెరిగి మంచి దిగుబడి వస్తుందని ఏజెన్సీ రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పర్యాటకులకు కంటికి విందునిస్తూ.. రైతులకు ఆశలు రేకెత్తిస్తున్న ఈ అకాల మంచు మన్యం అందాలను మరింత ద్విగుణీకృతం చేస్తోంది.
సెప్టెంబర్‌లోనే శీతాకాలాన్ని తలపిస్తున్న వాతావరణం


