జి.మాడుగుల: సైబర్ నేరాల నివారణతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సోషల్ మీడియా సీఐ వెంకటరమణ, స్థానిక ఎస్‌ఐ సాయిరాం పడాల్ సూచించారు. మండలంలోని సంతబయలు గ్రామంలో మంగళవారం జరిగిన వారపుసంతలో సైబర్ మోసాలు, గంజాయి నిర్మూలన, రహదారి భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గంజాయి సాగు, రవాణా, వినియోగం సమాజానికి శ్రేయస్కరం కాదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలను గిరిజనులకు వివరించారు. అలాగే ఆన్‌లైన్ స్కామ్‌లు, ఓటీపీ, యూపీఐ పిన్ మోసాల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు, తెలియని ఫోన్ కాల్స్‌కు బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు తెలపకూడదని స్పష్టం చేశారు.వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


