సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఇస్తుందో లేదో తెలియదు గానీ, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పింఛన్ పొందడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలపై గిరిజనులకు అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు పొందడం, వాటిని సచివాలయాలకు తీసుకెళ్లి దరఖాస్తుతో పాటు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వంటి పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధ్రువీకరణ పత్రాల సేకరణలో ఆలస్యం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒంటరి మహిళలకు సంబంధించిన సర్టిఫికెట్ల మంజూరులో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. దీనికితోడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఇప్పటికీ అనేకచోట్ల దరఖాస్తుదారులు పత్రాలను పూర్తిస్థాయిలో పొందలేని దుస్థితి నెలకొంది. అర్హులైన ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ధ్రువీకరణ పత్రాలు దొరక్క అల్లాడుతున్నారు. మరోవైపు విద్యుత్ మీటర్ రీడింగ్, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, ఆధార్ హిస్టరీ వంటి వివరాలను కూడా దరఖాస్తులో పొందుపరచాలనే నిబంధనలతో గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా నెట్‌వర్క్ సమస్యలు
జిల్లాలోని 11 మండలాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులతో పాటు దరఖాస్తుదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళవారం దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేందుకు వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో అన్ని సచివాలయాల్లోనూ పనులు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ ప్రక్రియ, ఓటీపీల కోసం దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఓటీపీలు రాకపోవడంతో చేసేదేమీ లేక నిరాశతో ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.
గడువు పెంచాలి.. – ప్రజాసంఘాల డిమాండ్
పింఛన్ దరఖాస్తుల స్వీకరణ సమయాన్ని పెంచాలని జిల్లా వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో సుమారు 5 వేల మంది వరకు దరఖాస్తులు సమర్పించలేకపోయారు. ఇప్పటికీ ఓటీపీలు రానివారు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని గిరిజనులు, ప్రజాసంఘాలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటివరకు 13,085 దరఖాస్తుల స్వీకరణ
జిల్లా వ్యాప్తంగా 212 గ్రామ సచివాలయాల పరిధిలో మంగళవారం సాయంత్రం నాటికి 13,085 దరఖాస్తులను డీఆర్‌డీఏ అధికారులు స్వీకరించారు. వీటిలోనూ ఓటీపీల సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 9,690, వితంతు 2,211, దివ్యాంగులు 1,095, ఒంటరి మహిళలు 78, మత్స్యకారులు 6, ఇతరులు 3, డప్పు కళాకారులు ఒకటి, సంప్రదాయ చర్మకారులు ఒకటి ఉన్నాయి. బుధవారమే దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో, గడువు ముగుస్తుందనే భయంతో వేలాది మంది దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
పింఛన్ ఆశలకు
సర్వర్ శాపం
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
దరఖాస్తు చేసేందుకు అవస్థలు
నేటితో ముగియనున్న గడువు
స్పందించని ప్రభుత్వం
పేదల్లో ఆందోళన


