మృత్యువులోనూ వీడని స్నేహ బంధం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

Sep 11 2026 10:04 AM | Updated on Sep 11 2026 10:04 AM

● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గీత కార్మికులు మృతి ● పెన్షన్‌ దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తుండగా విషాదం

అచ్యుతాపురం రూరల్‌ : పెన్షన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు గీత కార్మికులను వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రమైన అచ్యుతాపురానికి కూత వేటు దూరంలో ఉన్న వెదురువాడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెట్టధర్మవరం గ్రామానికి చెందిన గీత కార్మికులు పెంకే మారయ్య (53), రెడ్డి అప్పారావు (53) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీఎస్‌ మోపేడ్‌ (ఏపీ40హెచ్‌జీ8272) నెంబరు గల ద్విచక్ర వాహనంపై వెదురువాడ సచివాలయానికి బయలు దేరారు. మారయ్య వాహనం నడుపుతుండగా, అప్పారావు వెనుక కూర్చున్నారు.

పూడి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ కూడలికి సుమారు 100 మీటర్ల దూరంలో యలమంచిలి వైపు నుండి వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన గ్లామర్‌ బైక్‌ (ఏపీ31డీజెడ్‌7909) వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో మారయ్య, అప్పారావులకు తీవ్రంగా గాయాలు కావడంతో రోడ్డుపై పడిపోయారు. వెంటనే అంబులెన్స్‌లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో రెడ్డి అప్పారావు మృతి చెందగా, అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో పెంకే మారయ్య కూడా మృతి చెందారు. అప్పారావు భార్య రెడ్డి నూకరత్నం గురువారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు దర్యాప్తును ఎస్‌ఐ ఎమ్‌.వెంకటరావు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బైక్‌ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అకాల మరణం చెందిన ఇద్దరూ 1973వ సంవత్సరంలో జన్మించి నేటికీ అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించారని కుటుంబీకులు ఆవేదన చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కుటుంబ పెద్దలు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన ఇరువురు కుటుంబాల్లో ఇంకా తమ బాధ్యత నెరవేర్చాల్సి ఉండగా ఇటువంటి అనుకోని ప్రమాదంలో ఇరువురి ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. ప్రభుత్వం స్పందించి మృతుని కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, అనకాపల్లి జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షులు పెంకే మారేష్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement