దేవరాపల్లి : మండలంలోని కాశీపురం పంచాయతీ శివారు చంద్రయ్యపేటలో విద్యార్థులు లేక మూతపడిన ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. రెండేళ్ల క్రితం నుంచి విద్యార్థులు లేని కారణంగా (జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్) ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలను దేవరాపల్లికి సర్దుబాటు చేశారు. ఒక్క విద్యార్ది కూడా లేని పాఠశాలలో నిర్మించిన ప్రహరీ గోడను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం ప్రారంభోత్సవం చేయడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ ప్రహరీ గోడను నిర్మించారని పంచాయతీకి చెందిన పలువురు వ్యక్తులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. కేవలం టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకే రూ.9.92 ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ప్రహరీ గోడను నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ నిధులను ఇలా దుర్వినియోగం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులను ప్రజా ప్రయోజనం కోసం కాకుండా తమ పార్టీ కార్యకర్తల లబ్ధి కోసం కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాశీపురం నుంచి గవరవరం వరకు రోడ్డు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్డులో రాళ్లు తేలడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారని, ఇంతటి ప్రాధాన్యం కలిగిన రోడ్డును పట్టించుకోకపోవడం దారుణమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇక్కడి పాఠశాల ప్రహరీ ప్రారంభోత్సవానికి ఉపాధి కూలీలను పని ప్రదేశం నుంచి తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేయడం, సుమారు నాలుగైదు వారాలుగా కూలీ సొమ్ము అందక అవస్థలు పడుతున్నా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తుంది.


