మన్యంలో
స్థానికంగా రూ.10కే లభించే సిల్వర్ ఓక్ మొక్కకు టెండర్లలో రూ.19 మన్యం మొక్కల్ని వదిలి.. కడియం మొక్కలకు ‘పచ్చజెండా’
● గిరిజన నర్సరీలకు మొండిచెయ్యి
● మైదాన ప్రాంత వ్యాపారులకు పెద్దపీట
● డ్వామా అధికారుల ఇష్టారాజ్యం
● డిప్యూటీ సీఎంని కలిసినా దక్కని న్యాయం
అల్లం తిన్న నోటికి బెల్లం ఇచ్చినట్టు ఉండాలి కానీ.. ఇంటి దీపం ఆర్పేసి, పొరుగింటిలో వెలుగు నింపినట్టు ఉంది డ్వామా అధికారుల తీరు. తక్కువ ధరకు సొంత ఊరిలోనే లభించే మొక్కలను వదిలేసి, కడియం వ్యాపారుల జేబులు నింపడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా భక్షిస్తున్నారు. గిరిజన నర్సరీల నోట్లో మట్టికొడుతూ సాగుతున్న ఈ ’సిల్వర్ ఓక్’ టెండర్ల దందా మన్యంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.
సాక్షి, పాడేరు : కాఫీ తోటల విస్తరణలో భాగంగా పంపిణీ చేసే నీడనిచ్చే ’సిల్వర్ ఓక్’ మొక్కల కొనుగోలు వ్యవహారంలో డ్వామా అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్థానికంగా రూ.10లకే లభించే మొక్కను పక్కనబెట్టి, మైదాన ప్రాంత వ్యాపారుల నుంచి రవాణాతో కలిపి రూ.19 చొప్పున కొనుగోలు చేసేందుకు టెండర్లు ఖరారు చేయడంపై మన్యంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉపాధి హామీ నిధుల సాకుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బయటి వ్యాపారులకు దోచిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజనుల ఉపాధికి గండి
కాఫీ తోటల విస్తరణకు దాదాపు కోటి సిల్వర్ ఓక్ మొక్కలు అవసరం. గత ప్రభుత్వాల హయాంలో ఐటీడీఏ కాఫీ విభాగం స్థానిక గిరిజన నర్సరీల నుంచే వీటిని కొనుగోలు చేస్తూ వారి ఉపాధికి బాటలు వేసేది. అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం స్థానిక నర్సరీలను విస్మరించి, మైదాన ప్రాంతాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తూ గిరిజన రైతుల పొట్ట కొడుతోంది.
అధికారుల ఇష్టారాజ్యం
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణలోనే ఈ పంపిణీ జరగాల్సి ఉన్నా, కొందరు అధికారులు ఉన్నతాధికారులను పక్కదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏజెన్సీ పరిధిలో గిరిజనులు తమ నర్సరీల్లో దాదాపు 90 లక్షల మొక్కలను విక్రయానికి సిద్ధం చేశారు. ఒక్కో మొక్క పెంపకానికి రూ.6 వరకు ఖర్చు కాగా, రూ.10కే విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయినా డ్వామా అధికారులు స్థానిక మొక్కలను కొనేందుకు ముఖం చాటేస్తున్నారు.
సిండికేట్‌గా మారి ధరల బాదుడు
30 వేల ఎకరాలకు సరిపడే 98 లక్షల సిల్వర్ ఓక్ మొక్కల కోసం డ్వామా సంస్థ టెండర్లు పిలవగా, టెండర్ల సమాచారం గిరిజనులకు అందకుండా చేశారు. దీంతో కడియం, రాజమండ్రికి చెందిన 65 మంది మైదాన ప్రాంత వ్యాపారులు సిండికేట్‌గా మారి టెండర్లను దక్కించుకున్నారు. ఒక్కో మొక్కకు రూ.15, రవాణా ఖర్చు కింద మరో రూ.4 చొప్పున మొత్తం రూ.19కి అధికారులు ధర ఖరారు చేయడం గమనార్హం.
డిప్యూటీ సీఎంను కలిసినా..
మొక్కల పెంపకం కోసం ఒక్కో నర్సరీ నిర్వాహకుడు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. తీరా కొనేవారు లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను, ఆయన పేషీ అధికారులను కలిసి తమ బాధను వెళ్లబోసుకోగా.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు డ్వామా అధికారులు తమ నర్సరీలను పరిశీలించడానికి కూడా రాలేదని గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా కొనుగోలు చేయాలి
కాఫీ తోటలకు అవసరమైన లక్షలాది సిల్వర్ ఓక్ మొక్కలు స్థానిక గిరిజన నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయి. వాటిని వదిలేసి టెండర్ల పేరుతో మైదాన ప్రాంత వ్యాపారులకు కట్టబెట్టడం తీవ్ర అన్యాయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా నర్సరీల్లోని మొక్కలనే కొనుగోలు చేయాలి.
– తుర్రె సత్యమయ్య, నర్సరీ యజమాని, పాడేరు
స్థానిక నర్సరీల వద్దకొనుగోలు చేస్తాం
సిల్వర్ ఓక్ మొక్కల సరఫరాకు సంబంధించి పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియను నిర్వహించాం. టెండర్లలో స్థానిక నర్సరీల నిర్వహకులు పాల్గొనకపోవడంతో టెండరు సాధించిన వ్యాపారులకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది. స్థానికంగా నర్సరీలు నిర్వహిస్తున్న గిరిజన రైతుల వద్ద ప్రస్తుతం మొక్కలు కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం.
– విద్యాసాగర్, పీడీ, డ్వామా


