సెల్‌ టవర్ల నిర్మాణం వేగవంతం | - | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్ల నిర్మాణం వేగవంతం

Sep 11 2026 9:34 AM | Updated on Sep 11 2026 9:34 AM

సాక్షి, పాడేరు: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం నెట్‌వర్క్‌ సేవలు అందించేందుకు మంజూరైన సెల్‌టవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె నెట్‌వర్క్‌ సంస్థల ప్రతినిధులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను అధికారులు వెంటనే సమర్పించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ క్లియరెన్స్‌ ఇచ్చిన అన్ని ప్రాంతాల్లో పనులను తక్షణమే ప్రారంభించి, వేగవంతం చేయాలని సూచించారు. జియో సంస్థకు మంజూరైన 6 ప్రదేశాలకు గానూ ఇప్పటికే 2 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. టవర్ల నిర్మాణానికి స్థానిక కార్మికులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్థల సమస్యలు ఏవైనా ఉంటే తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అలాగే నెట్‌వర్క్‌ కనెక్టివిటీకి రహదారుల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించి వివరాలు అందజేయాలని కోరారు.

చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో భారీగా పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. వినాయక చవితి ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, అగ్నిమాపక, రవాణా, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో విధానం ద్వారానే మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. రహదారులపై రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. లౌడ్‌ స్పీకర్లు, మైకులు, డిజే సౌండ్స్‌ వాడకంపై పూర్తి నిషేధం ఉంటుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి, వీటిని రాత్రి 9 గంటలలోపే ముగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటుకు దారి కాచి, తాడులు, కర్రలు అడ్డుపెట్టి వాహనదారుల నుంచి బలవంతపు చందాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు నిర్దేశించిన చెరువులు, గెడ్డలలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లోతుగా ఉండే ప్రవాహాలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, డీఎల్పీవో కుమార్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయానంద్‌, డీఈఈ సీహెచ్‌ పాత్రుడు, అగ్నిమాపక అధికారి లక్ష్మణస్వామి, ఎంపీడీవో తేజారతన్‌ పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement