క్లీన్‌స్వీప్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌ లక్ష్యం

Sep 11 2026 9:34 AM | Updated on Sep 11 2026 9:34 AM

స్థానిక ఎన్నికల్లో
● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావులేకుండా బరిలోకి.. కష్టపడే కార్యకర్తలకే టికెట్లు ● కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, గిరిజన వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటానికి పిలుపు

అరకులోయ టౌన్‌: కూటమి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం అరకులోయలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసి.. పార్టీ బలాన్ని మరోసారి చూపించాలన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకే అవకాశమిస్తూ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, గిరిజన వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ’వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు.

వెన్నుపోటు పాలన

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా గిరిజనులకు వెన్నుపోటు పొడవడమే నైజమని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అరకులో నిర్వహించిన సభలో చంద్రబాబు ఇచ్చిన జీవో నంబరు 3 హామీని నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గిరిజనుల సత్తా ఏంటో చూపించాలన్నారు.

కూటమి నేతల్లో భయం

అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడంతో కూటమి నేతల్లో గుండె దడ మొదలైందని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు మన్యంలో పర్యటించి ఓట్లు అడుక్కునే దుస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి

పాడేరు ఏజెన్సీలోని 135 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. స్థానిక పోరులో విజయం సాధిస్తే, 2029లో జగన్‌ను మళ్లీ సీఎం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాలు జగనన్న వైపే నిలిచాయని కొనియాడారు.

టీడీపీ కాదు.. వెన్నుపోటు పార్టీ

ఇకపై ’తెలుగుదేశం పార్టీ’ అని అనకుండా ’వెన్నుపోటు పార్టీ’ అని సంబోధించాలని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు బాణాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి గాలిలోనూ మన్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారని గుర్తుచేశారు.

అభ్యర్థులను ముందేసిద్ధం చేసుకోవాలి

ప్రతి సెగ్మెంట్‌లోనూ ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థిని ముందుగానే ఎంపిక చేసుకుంటే రిజర్వేషన్ల సమయానికి ఉపయోగపడుతుందని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకట్రామయ్య సూచించారు. నాడు–నేడు, మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో మన్యాన్ని అభివృద్ధి చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి, ’జగన్‌ అనే నేను’ అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలంటే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిష్టానం ఎవరికి టికెట్‌ కేటాయించినా వారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో కూటమికి బలమైన క్యాడర్‌ లేదని, ఈ పరిస్థితిని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు.

గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి మరింత బలం

గతంలో ’గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరిందని, మన్యం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలకు మంచి గౌరవం ఉందని మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కన్వీనర్లు, బూత్‌ కన్వీనర్లను నియమించామని గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో వారికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మాజీ జీసీసీ చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, జిల్లా ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబు, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, ఎంపీపీలు బాకా ఈశ్వరి, టి. మిథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామమూర్తి, పాంగి పరశురామ్‌, కొర్రా సూర్యనారాయణ, చంద్రుబాబు, అనిల్‌, పద్యారావు, ఉపాధ్యక్షులు పల్టాసింగ్‌ విజయ్‌ కుమార్‌, ప్రకాష్‌ రావు తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీ తనూజారాణి, అసెంబ్లీ పరిశీలకులు

వెంకట్రామయ్య, శ్రీనివాస్‌, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, వేదికపై ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

వైఎస్సార్‌సీపీలోభారీగా చేరికలు

హుకుంపేట నుంచి 40 మంది, పెదబయలు నుంచి 50 మంది, ముంచంగిపుట్టు నుంచి 30 మంది, అనంతగిరి నుంచి 20 మంది కూటమి కార్యకర్తలు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement