కశింకోట : మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద అనుసంధాన ప్రాంతంలో పోలవరం ఎడమ కాలువ నీటి ప్రవాహాన్ని గురువారం నిలిపి వేశారు. ఈ మేరకు ఏలేరు కాలువతో కలిసే చోట నీరు ప్రవహించకుండా పోలవరం కాలువకు అడ్డుకట్ట వేశారు. ఈ కాలువ ద్వారా తాగునీటి అవసరాలకు విశాఖలోని స్టీల్‌ప్లాంట్ వద్ద ఉన్న కణితి జలాశయానికి 250 క్యూసెక్కుల నీరు తరలింపు పూర్తి కావడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు పోలవరం 7వ ప్యాకేజీ అధికారులు తెలిపారు. మళ్లీ ఉన్నతాధికారుల ఆదేశిస్తే విశాఖకు నీటి తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తాళ్లపాలెం, యలమంచిలి మండలంలోను ఉన్న మదుముల ద్వారా పోలవరం కాలువ నీటిని వ్యవసాయ అవసరాలకు శారద, వరహా నదుల్లోకి విడుదల చేసి తరలిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా తాళ్లపాలెం వద్ద నర్సీపట్నం రోడ్డు వైపు రెండు వైపులా కొత్తగా నిర్మించిన పోలవరం కాలువ దిగువ నుంచి నీరు లీక్ అవుతుందని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానిక సంత ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలువ లీక్ కాదని, లీక్ అయితే అది క్రమేపీ పెద్దది అవుతుందని, అటువంటిది లేదని అధికారులంటున్నారు. సాధారణంగా ఉండే భూ స్థాయిలో నీరు అని, కాలువ నుంచి లీక్ అవ్వడం కాదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం కురిసిన వర్షానికి ఎడమ వైపు రక్షణ గట్టు నుంచి మట్టి కాలువలోకి కొంతమేర కొట్టుకుపోయి గొయ్యిలా ఏర్పడింది.


