పెదబయలు: స్థానిక గిరిజన సహకార సంస్థఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పాడేరు జీసీసీ డివిజన్ మేనేజర్ కృష్ణప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయన పెదబయలు జీసీసీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల పెదబయలు గ్యాస్ గోదాంలో లబ్ధిదారులకు గ్యాస్ అందించడంలో జాప్యం జరుగుతోందని, వినియోగదారులు అవస్థలు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికీ కొరత లేకుండా సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి, ప్రతి డీఆర్ డిపోలో ఇతర డీఆర్‌పీ సరుకుల అమ్మకాలను పెంచాలని సూచించారు. గ్యాస్ గోదాము నిర్వహణపై తరచూ ఫిర్యాదులు, వార్తలు వస్తున్నాయని... సిబ్బంది తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
రేపటి నుంచి గ్యాస్ డోర్ డెలివరీ
పెదబయలు జీసీసీ భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి గురువారం నుంచి డోర్ డెలివరీ చేస్తామని డీఎం తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్స్ పెరిగితే రెండు వాహనాల ద్వారా సరఫరా చేస్తామన్నారు.ఇదే సమయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు గంపరాయి సూరయ్య డీఎంను కలిసి ఒక వినతిపత్రం సమర్పి ంచారు. 2015–2016 సంవత్సరంలో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన వేలాది మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు గ్యాస్ బుక్కులు, బాండ్ పేపర్లు మంజూరు చేయలేదని డీఎం దృష్టికి తీసుకెళ్లారు. పాస్‌బుక్‌లు లేక, వివరాలు ఆన్‌లైన్ కాకపోవడంతో ప్రస్తుతం వారికి గ్యాస్ అందడం లేదని వివరించారు. వెంటనే వారికి గ్యాస్ పుస్తకాలు పంపిణీ చేసి, ఆధార్ కార్డుతో అనుసంధానించడం ద్వారా న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ జి. అప్పన్న, జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు.


