పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు 49 వసంతాలు పూర్తి చేసుకుని 50 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంలో 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పాయకరావుపేట, తుని, అన్నవరం బ్రాంచిల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా సేవా దృక్ఫథం కలిగి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2004 నుంచి ఇప్పటివరకు సుమారు 3000 యూనిట్ల రక్తాన్ని ఇచ్చి తమ విద్యార్థులు, సిబ్బంది తమ సేవా నిరతిని చాటుకున్నారన్నారు. ఈ శిబిరంలో సుమారు 400 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 40 సార్లు కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్, డా. పి.కామరాజు, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు డా.పరాసర్, మదర్ బ్లడ్ బ్యాంకు డా.సత్యనారాయణ, వీనస్ బ్లడ్ బ్యాంకు డా.సాల్మన్‌రాజు, స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామకృష్ణారెడ్డి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


