ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ లక్ష్మణరావు తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు లబ్బూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒడిశా వైపు నుంచి బైక్‌లపై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి వాహనాలను వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి బైక్‌లపై ఉన్న బస్తాలను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 22 కిలోల 100 గ్రాముల గంజాయి ఉన్నట్లు తేలిందని, దీని విలువ సుమారు రూ. 11 లక్షల 5 వేలు ఉంటుందని సీఐ వెల్లడించారు. పట్టుబడిన స్మగ్లర్లు ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా లమతాపుట్ బ్లాక్‌కు చెందిన బలరామ్, నీలు, గణపతిగా గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి గంజాయితో పాటు రెండు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. పదేపదే నేరాలకు పాల్పడే స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీఐ లక్ష్మణరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాని, స్థానిక పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


