సీలేరు సిగలో మరో
● అత్యాధునిక టెక్నాలజీతో భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
● 2029 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
● ఏటా 3,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ గ్రిడ్‌కు!
● స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
● దివంగత వైఎస్ హయాంలోనే ప్రాజెక్ట్‌కు బీజం
● త్వరలో ప్రాజెక్ట్ ప్రారంభానికి ఏర్పాట్లు
● చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు వెల్లడి
సీలేరు: దేశంలోనే మరోసారి సీలేరుకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తక్కువ వ్యయంతో జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించి రూ.కోట్లలో ఆదాయాన్ని అందిస్తున్న సీలేరు ప్రాంతంలో తాజాగా 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. సుమారు రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు లభించాయి.
● సీలేరు సమీపంలోని పార్వతీనగర్ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సుమారు ఐదేళ్లుగా నిర్వహించిన సర్వేల అనంతరం శ్రీశైలం తరహాలో పంప్డ్ స్టోరేజ్‌కు ఈ ప్రాంతం అనుకూలమని నిపుణులు తేల్చారు. తాజాగా అటవీ అనుమతులు రావడంతో ప్రభుత్వం జీవో నంబర్ 29 ద్వారా 128.61 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. దీంతో ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది.
వృథా నీటికి.. విద్యుత్ రూపం
బలిమెల జలాశయంలో ఏపీ వాటాగా ఉన్న నీటిని సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో వినియోగించిన అనంతరం శబరి మీదుగా గోదావరిలోకి చేరుతోంది. ఇలా ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసేందుకు గుంటవాడ జలాశయం నుంచి సొరంగ మార్గంలో పార్వతీనగర్‌కు తరలించి, అక్కడ 9 యూనిట్ల ద్వారా 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. అనంతరం నీటిని దిగువకు విడుదల చేసి, అవసరమైనప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా తిరిగి గుండవాడ జలాశయానికి తరలిస్తారు.
యూనిట్ విద్యుత్ రూ.4కే!
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే యూనిట్ విద్యుత్ సుమారు రూ.4కే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సీలేరు కాంప్లెక్స్‌లో మరింత ఉత్పత్తి
ప్రస్తుతం సీలేరులో 240 మెగావాట్లు, డొంకరాయిలో 25 మెగావాట్లు, మోతుగూడెంలో 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మోతుగూడెంలో నిర్మాణంలో ఉన్న మరో రెండు యూనిట్లు పూర్తయితే అదనంగా 230 మెగావాట్ల ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. దీనికి తోడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ద్వారా మరో 1,350 మెగావాట్లు జత కానున్నాయి.
ప్రారంభానికి సన్నాహాలు
2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేశారు. తాజాగా అన్ని అనుమతులు రావడంతో నిర్మాణ సంస్థ ఏర్పాట్లు ప్రారంభించింది. త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు తెలిపారు.
అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు డిజైనింగ్
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్నారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా.. విద్యుత్ గ్రిడ్‌లో డిమాండ్–సరఫరాను సమతుల్యం చేయడంలో కీలకంగా ఉపయోగపడేలా దీనిని రూపొందిస్తున్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక సహకారంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది.
● ప్రాజెక్టులో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది వర్టికల్ ఫ్రాన్సిస్ రివర్సిబుల్ పంప్ టర్బైన్లు, సింక్రనైజ్డ్ మోటార్–జనరేటర్ సెట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా మొత్తం 1,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
దేశానికే గుర్తింపు
దేశంలోనే ప్రత్యేకంగా నిలిచే విధంగా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 2029 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రాంతానికి తలమానికంగా నిలుస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే స్థానికంగా నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి.
– సుజయ్‌కుమార్, హైడల్ డైరెక్టర్


