గురుకుల విద్యార్థులను వెనక్కి పంపొద్దు | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థులను వెనక్కి పంపొద్దు

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

● ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కుడా రాధాకృష్ణ డిమాండ్‌ ● ఐటీడీఏ వద్ద తల్లిదండ్రుల దీక్షలకు మద్దతు

పాడేరు: విశాఖపట్నం జిల్లా మారిలవలస గిరిజన గురుకుల విద్యా సంస్థలో 5, 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులను వెనక్కి పంపాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుని, విద్యార్థులను యథావిధిగా అక్కడే కొనసాగించాలని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కుడా రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. స్థానిక ఐటీడీఏ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చేపడుతున్న రిలే దీక్షలు గురువారం మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు రాధాకృష్ణ దీక్షల్లో కూర్చొని తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు పేరుతో పాఠశాలలో 5, 6, 7 తరగతులు చదువుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన సుమారు 270 మంది విద్యార్థులను అర్ధాంతరంగా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించడం సరికాదన్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు గత కొన్నిరోజులుగా జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీఓలను కలిసి వినతిపత్రాలు అందజేసి సమస్యను వివరించినా ఇప్పటివరకు స్పందన లేకపోవడం విచారకరమన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థులను అక్కడే యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని రాధాకృష్ణ హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగుల సంఘం జిల్లా నాయకులు భాను, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement