అరణ్య రోదన | - | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

కొడుకు నవ్వితేనే తమ ప్రపంచమని భావించిన ఆ తల్లిదండ్రులకు... నేడు అతని నిస్సహాయ స్థితి నిత్యం కంటతడి పెట్టిస్తోంది. పోలియోతో మంచానికే పరిమితమైన కుమారుడికి సరైన వైద్యం, ప్రభుత్వ సాయం అందక అటవీ ప్రాంతంలోని మగ్గుతున్న ఓ గిరిజన కుటుంబం దయనీయ గత ఇది... వాళ్ల ఆశలన్నీ జిల్లా అధికార యంత్రాంగంమీదే....

సీలేరు: చిన్న వయసులో పోలియో బారిన పడిన ఆ బాలుడు నేడు మంచానికే పరిమితమవగా, తల్లిదండ్రులు అతని బాధను చూసుకుంటూ నిత్యం కన్నీటి పర్యంతమవుతున్నారు.గూడెంకొత్తవీధి మండలం గుమ్మురేవుల పంచాయతీ పరిధిలోని పరమశింగవరం గ్రామానికి చెందిన కొర్ర భాస్కరరావు,చిలకమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారి పెద్ద కుమారుడు రాజు చిన్నతనం వరకు ఆరోగ్యంగానే పెరిగాడు. పాఠశాలకు వెళ్తూ తోటి పిల్లలతో ఆడిపాడుతూ ఉండేవాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులో నడుము నొప్పితో బాధపడడం ప్రారంభమైంది. ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేమి కారణంగా సరైన వైద్యం అందించలేకపోయారు. నాటు వైద్యాన్ని ఆశ్రయించేలోపే వ్యాధి తీవ్రరూపం దాల్చింది. పోలియో ప్రభావంతో చేతులు, కాళ్లు వంకర తిరిగి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం కనీసం స్వయంగా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు.

సదరం సర్టిఫికెట్‌ అందని వైనం

రాజు నివసిస్తున్న గ్రామం పోలవరం సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి పంచాయతీ కార్యాలయానికి డోలీలో, అడవి దారులు, వాగులు దాటి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రానికి చేరుకోవడం మరింత కష్టసాధ్యం. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇప్పటివరకు రాజుకు సదరం వికలాంగుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోలేకపోయారు.

పింఛను కోసం ఎదురుచూపులు

సదరం సర్టిఫికెట్‌ లేకపోవడంతో ప్రభుత్వం అందించే దివ్యాంగుల పెన్షన్‌ కూడా అందడం లేదు. వ్యవసాయ కూలి పనులపై ఆధారపడే ఈ కుటుంబానికి రాజు వైద్య ఖర్చులు, సంరక్షణ భారంగా మారాయి. పెద్ద కొడుకును కళ్లముందే మంచంపై నిస్సహాయంగా చూస్తూ జీవించడం తప్ప తమకు మరో మార్గం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌ స్పందించాలని వేడుకోలు

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రాజుకు సదరం సర్టిఫికెట్‌ జారీ చేసి, దివ్యాంగుల పెన్షన్‌ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ప్రభుత్వ సహాయం అందితే తమ కుమారుడి జీవితం కొంతైనా మెరుగుపడుతుందనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.

పోలియోతో మంచానికే పరిమితమైన గిరిజన బాలుడు

సదరం సర్టిఫికెట్‌, దివ్యాంగులపింఛన్‌ కోసం ఎదురుచూపులు

జిల్లా యంత్రాంగం కరుణించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement