చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో మండలంలోని తాజంగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రారంభంలో నిర్మాణం వేగంగా సాగినప్పటికీ పలు కారణాలతో పలుమార్లు నిలిచిపోవడంతో పనులు మందగించాయి. అనంతరం పాత కాంట్రాక్టర్ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసి, రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడంతో మూడోసారి టెండర్ దక్కించుకున్న కొత్త కాంట్రాక్టర్ పనులను చేపట్టారు. దీంతో ప్రస్తుతం నిర్మాణానికి మళ్లీ ఊపు వచ్చింది.
టెండర్ల జాప్యంతో..
మొదట నియమించిన కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది. అనంతరం రెండుసార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేకపోయింది. మూడోసారి టెండర్ పొందిన కాంట్రాక్టర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టి పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం పనులు ఆశాజనకంగా కొనసాగుతుండగా, అధికారులు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నాలుగు బ్లాకులుగా నిర్మాణం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ మ్యూజియాన్ని నాలుగు ప్రధాన విభాగాలుగా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు, పోరాటాల్లో ఉపయోగించిన ఆయుధాలు, చారిత్రక విశేషాలతో ప్రధాన మ్యూజియం.
● టికెట్ కౌంటర్, ఓపెన్ ఎయిర్ అంఫి థియేటర్, మ్యూజియం కాంప్లెక్స్, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు.
● ల్యాండ్ లెవెలింగ్, సిమెంట్ రహదారులు, ప్రహరీ, పార్కింగ్ తదితర మౌలిక వసతులు. పర్యాటకులను ఆకర్షించే ఆధునిక సౌకర్యాలతో పాటు గిరిజన సంస్కృతి, స్వాతంత్య్ర పోరాట చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన విభాగాలు.
● ప్రస్తుతం ప్రధాన మ్యూజియం, టికెట్ కౌంటర్, మ్యూజియం కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు కలిపి దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. వర్షాకాల పరిస్థితులను అధిగమిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు.
పర్యాటకానికి కొత్త ఆకర్షణ
వచ్చే పర్యాటక సీజన్‌కు ముందే మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.
మ్యూజియం పూర్తయితే లంబసింగి–తాజంగి ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఏడాది పొడవునా సందర్శకులు వచ్చి మన్యం వీరుల త్యాగగాథలు, గిరిజన సంస్కృతి, స్వాతంత్య్ర పోరాట చరిత్రను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో స్థానిక పర్యాటక రంగానికి, చిన్న వ్యాపారాలకు, ఉపాధి అవకాశాలకు కూడా ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూ.35 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
ఈ మ్యూజియం నిర్మాణానికి 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.35 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.10 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.5 కోట్లు విడుదల కాగా, మిగిలిన నిధులు కూడా త్వరలో విడుదల కానున్నాయి.
వేగంగా అందుబాటులోకి తేవాలి
తాజంగిలో నిర్మిస్తున్న మ్యూజియాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మ్యూజియం ప్రారంభమైతే స్థానికంగా ఉన్న అనేక మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంబంధిత అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి.
– కోరాబు అనూషదేవి, ఎంపీపీ, చింతపల్లి
సెప్టెంబర్ కల్లా పూర్తిచేస్తాం
ఈ ఏడాది పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ నాటికి అన్ని సౌకర్యాలతో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం మ్యూజియం నిర్మాణ పనులు దా దాపు 80 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేస్తాం.
– రఘునందన్ నాయుడు,
డీఈఈ, గిరిజన సంక్షేమ శాఖ, చింతపల్లి
22 ఎకరాల్లో అభివృద్ధి
తాజంగిలో వ్యవసాయ శాఖకు చెందిన 22 ఎకరాల భూమిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అభివృద్ధి చెందుతోంది. అందులో 11 ఎకరాల్లో మ్యూజియం నిర్మాణం, మరో 11 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నిర్మాణ పనులకు అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి 2021 అక్టోబర్ 8న శంకుస్థాపన చేశారు.


