● 68 రోజుల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తి
● వినియోగంలోకి ఒకటో నంబరు జనరేటర్
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సంయుక్త నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ఏడాది మే 23న విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కంట్రోల్ రూమ్‌లోని ప్యానెల్ బోర్డులు, కేబుళ్లు, ఇతర విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు చాలా నెలలు పడుతుందని తొలుత అధికారులు భావించారు. అయితే ఏపీ జెన్‌కో జలవిద్యుత్ విభాగం సంచాలకుడు ఎస్. అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని, దెబ్బతిన్న ప్యానెల్‌లు, కేబుళ్లు, ఇతర సామగ్రిని రాష్ట్రంలోని వివిధ జలవిద్యుత్ కేంద్రాల నుంచి యుద్ధప్రాతిపదికన తెప్పించి పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. జెన్‌కో ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది సమష్టి కృషితో కేవలం 68 రోజుల్లోనే పనులు పూర్తి చేసి, బుధవారం అర్ధరాత్రి నుంచి నంబర్–1 జనరేటర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒకటో నంబరు జనరేటర్ ద్వారా 17 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గత రెండు నెలలుగా విద్యుత్ సౌధ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నూతన ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేసి, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. మిగిలిన జనరేటర్లను కూడా దశలవారీగా వినియోగంలోకి తీసుకువస్తామని ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ సీహెచ్ అప్పాజీ తెలిపారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో విద్యుత్ సౌధ డిప్యూటీ ఇంజినీర్ ఎం. వెంకటరమణ, మాచ్‌ఖండ్ ఈఈ బి. గోవిందరాజులు, ప్రాజెక్టు ఇంజినీర్లు, ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమించి విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభానికి కృషి చేశారు.


