జి.మాడుగుల: రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ విమర్శించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈనెల 28న ఉదయం 11 గంటలకు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువతకు న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఒక్కటై తమ స్వరాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ర్యాలీని విజయవంతం చేయాలి
అరకులోయ టౌన్ (డుంబ్రిగుడ): జిల్లా కేంద్రం పాడేరులో ఈ నెల 28న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత, విద్యార్థుల ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య పిలుపునిచ్చారు. ఆదివారం అరకులోయ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపుతో, అల్లూరి సీతారామరాజు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బడ శేఖర్ ఆధ్వర్యంలో ఈ నెల 28న పాడేరు జిల్లా కేంద్రంలో యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అవకతవకలను వెలికితీసి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్


