సీలేరు: యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం కార్యాలయాల వద్ద కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీలేరులో కార్మికులు ఏపీ జెన్‌కో ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, కార్యదర్శి టి.విష్ణుకుమార్ మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ బేషరతుగా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, తెలంగాణ తరహాలో రూ.48 వేల కనీస వేతనం చెల్లించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రతి కార్మికుడికి రూ. 20 లక్షల గ్రాట్యుటీ, రూ. కోటి ప్రమాద బీమా కల్పించాలని పేర్కొన్నారు. సీలేరు కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులను మ్యాన్ పవర్ కార్మికులుగా గుర్తించాలని కోరారు.
కాంట్రాక్టర్లు ప్రతి నెలా 7వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం ధర్నా


