నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పర్యటన వివరాలిలా..
● ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
● ఉదయం 10.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
● ఉదయం 11.40 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
● మధ్యాహ్నం 1.10 గంటలకు అరకు నుంచి హెలికాప్టర్‌లో తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
● మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు.
● మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు.
అరకులో ఏర్పాట్లు పూర్తి
సాక్షి, పాడేరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అరకులోయ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వజ్రాలమెట్ట వద్ద హెలీప్యాడ్, అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న వివాహ వేదిక వద్దకు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి తదితర నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, గిరిజనులు భారీగా తరలిరానున్నారు. అరకులోయ అంతటా ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పక్షపాతి అయిన మాజీ సీఎంకు భారీ స్థాయిలో ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


