నేత్రపర్వం... వెంకన్న చక్రతీర్థం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం... వెంకన్న చక్రతీర్థం

Mar 4 2026 7:35 AM | Updated on Mar 4 2026 7:35 AM

● స్వామివారికి సాగర జలాలతో అభిషేకం ● ఘనంగా మహాపూర్ణాహుతి ● సముద్ర స్నానాలకు వేలాదిగాతరలివచ్చిన భక్తజనం

నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఉపమాక వెంకన్న చక్రవారి స్నానం మంగళవారం ఘనంగా జరిగింది. పౌర్ణమినాడు వేంకటేశ్వరస్వామి అత్తవారింటికి (సముద్రుడి) వెళ్లే సన్నివేశాన్ని చక్రవారి స్నానంగా పిలుస్తారు. కల్యాణం అనంతరం పౌర్ణమి నాడు ఉదయం ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులను ఎదురుగా ఉంచి రోలు రోకలికి పూజలు నిర్వహించారు. చూర్ణోత్సవంలో భాగంగా చూర్ణాన్ని భక్తులపై జల్లారు. కల్యాణం అనంతరం స్వామివారిని భక్తులకు అద్దంలో చూపించి దర్శనం కల్పించారు. ఏటా పౌర్ణమినాడు రాత్రిపూట జరిగే ఈ కార్యక్రమం చంద్ర గ్రహణం వల్ల మధ్యాహ్నంలోపు పూర్తి చేసి ఆలయాన్ని మూసి వేశామని ప్రధానార్చకుడు వరప్రసాదాచార్యులు తెలిపారు.

రాజయ్యపేట సముద్ర తీరంలో చక్రతీర్థం..

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని రాజాధిరాజ వాహనంపై ఉంచి రాజయ్యపేట సముద్ర తీరానికి తీసుకెళ్లి స్నానమాచరింపజేశారు. అనంతరం నూతన వస్త్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు సముద్రంలో స్నానం చేసేందుకు పోటీపడ్డారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పలువురు తోడపెద్దులు, అమ్మవారి ఘటాలు (గరగలు)ను తీసుకువచ్చి సముద్ర స్నానమాచరింపచేశారు. చంద్ర గ్రహణం కావడంతో మధ్యాహ్నం ఆలయాన్ని మూసి వేశారు. సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో అద్దాల మండపంలో స్వామివారికి డోలోత్సవం(అద్దపు సేవ) నిర్వహించారు.

స్వామివారి గర్భాలయ ప్రవేశాన్ని శ్రీదేవీ,భూదేవీ అడ్డుకోవడం, తానెవరో వివరించి గర్భాలయ ప్రవేశ సన్నివేశాన్ని అర్చక స్వాములు కళ్లకు కట్టినట్లు వివరించారు. అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, నరశింహాచార్యులు, శ్రీనివాసాచార్యులు, గోపాలా చార్యులు, సాయిఆచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సీఐ మురళి, ఎస్‌ఐ సన్నిబాబుల ఆధ్వర్యలో చక్రవారీ తీర్థం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement